ePaper
Wednesday, May 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeవిమాన సర్వీసులను నిలిపివేసిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్విమాన సర్వీసులను నిలిపివేసిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్

విమాన సర్వీసులను నిలిపివేసిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్

📰 Generate e-Paper Clip

అమెరికాకు చెందిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ తాజాగా తన విమాన సర్వీసులు అన్నిటినీ రద్దు చేసింది. తన కార్యకలాపాలు అన్నిటికీ త్వరలో ఫుల్ స్టాప్ పెడతామని శనివారం వెల్లడించింది.

ఇంటర్నెట్ డెస్క్ మే 2 ( మహాప్రభ ) : ఇంధన ధరల పెరుగుదలతో కష్టాల్లో కూరుకుపోయిన అమెరికా విమానయాన సంస్థ స్పిరిట్ ఎయిర్‌లైన్స్ తమ ఫ్లైట్ సర్వీసులు అన్నిటినీ రద్దు చేశామని తాజగా ప్రకటించింది. త్వరలో అన్ని కార్యకలాపాలకు ఫుల్ స్టాప్ పెడతామని శనివారం ప్రకటించింది. ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్నామని, ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో మరో దారి లేక ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ వెల్లడించింది.

‘అన్ని స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌ సర్వీసులను రద్దు చేశాము. మా ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు వెళ్లవద్దని సూచిస్తున్నాము’ అని ఎయిర్‌లైన్స్ మాతృసంస్థ స్పిరిట్ ఏవియేషన్ హోల్డింగ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. కస్టమర్ సర్వీస్ అందుబాటులో లేదని కూడా సంస్థ వెబ్‌సైట్‌లో నోటీసు కనిపించింది. అయితే, ఇప్పటికే టికెట్లు కొన్న వారికి డబ్బుల రీఫండ్‌ ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని కూడా సంస్థ తెలిపింది.

ఇక స్పిరిట్ ఎయిర్‌లైన్స్ కార్యకలాపాల నిలిపివేతపై కంపెనీ అధ్యక్షుడు, సీఈఓ డేవ్ డేవిస్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కష్టాల్లో ఉన్న సంస్థ పునర్‌వ్యవస్థీకరణ ప్లాన్‌పై బాండ్ హోల్డర్స్‌తో మార్చి నెలలో అంగీకారం కుదిరిరిందన్నారు. అయితే, అకస్మాత్తుగా విమాన ఇంధన ధరలు పెరగడంతో పరిస్థితి చేయిదాటి పోయిందని అన్నారు. కంపెనీ కార్యకలాపాలను నిలిపివేయడం మినహా మరో దారి లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. ‘వ్యాపారాన్ని కొనసాగించేందుకు వందల మిలియన్ల నిధులు కావాలి. మా వద్ద అంత డబ్బు లేదు. నిధులను సమీకరించే అవకాశం కూడా లేదు. ఇది చాలా విచారకరమైన పరిణామం’ అని అన్నారు.

ఇరాన్‌తో యుద్ధం మొదలయ్యాక అమెరికాలో విమాన ఇంధన ధరలు రెండింతలు అయ్యాయి. దీంతో, అనేక ఎయిర్‌లైన్స్ ఇప్పటికే ఈ ఏడాది లాభాల అంచనాలను తగ్గించుకున్నాయి. కార్యకలాపాల విస్తరణపై పెట్టుబడులకు కూడా బ్రేక్ చెప్పాయి. అప్పుల భారం, కార్యనిర్వహణ వైఫల్యాల కారణంగా స్పిరిట్ ఎయిర్‌లైన్స్ 2024 నవంబర్‌లోనే దివాలా తీసినట్టు ప్రకటించింది. ఆ తరువాత పునర్‌వ్యవస్థీకరణ ప్లాన్‌లో భాగంగా మళ్లీ కార్యకలాపాలను ప్రారంభించింది. కంపెనీని పూర్తిగా గట్టెక్కించేందుకు మరో ప్రణాళికపై కూడా చర్చలు జరుగుతున్నాయి. సంస్థను ఆదుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం శుక్రవారం ఒక ప్లాన్‌ను ప్రతిపాదించింది. ఇదే తన చివరి ఆఫర్ అని కూడా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఈ క్రమంలోనే శనివారం స్పిరిట్ ఎయిర్‌లైన్స్ తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!