ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్స్ లాభాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు కూడా సూచీలను లాభాల బాట పట్టించాయి.
ఇంటర్నెట్ డెస్క్ మే 4 ( మహాప్రభ ) : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో పాటు ఎన్నికల ఫలితాలు కూడా ప్రభావం చూపించడంతో సెన్సెక్స్ 355.90 పాయింట్ల లాభంతో 77,269.40 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 77,910.75 వద్ద గరిష్ఠాన్ని తాకింది. మరోవైపు నిఫ్టీ కూడా 121.75 పాయింట్ల లాభంతో 24,119.30 వద్ద స్థిరపడింది.
నేడు హెచ్‌యూఎల్, మారుతీ సుజుకీ, బజాజ్ ఫైనాన్స్ సంస్థల షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, ఇన్ఫోసిస్ నష్టాలను చవిచూశాయి. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.08 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 113 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఔన్స్ 24 క్యారెట్ బంగారం ధర 4545 డాలర్లుగా ఉంది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఇప్పటికీ 100 డాలర్లకు పైనే ఉండటం, ద్రవ్యోల్బణం భయాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వారం సూచీలు ఒడిదుడుకులు ఎదుర్కునే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
