పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలోగల ఓ పోలింగ్ బూత్ వద్ద తాజాగా కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తి బూత్ వద్ద నాటు బాంబు విసరడంతో పలువురు గాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 23 (మహాప్రభ) : పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో పోలింగ్ వేళ తాజాగా నాటు బాంబుతో దాడి జరగడం కలకలానికి దారి తీసింది. జిల్లాలోని నవోదా ప్రాంతంలోగల ఒక పోలింగ్ బూత్ సమీపంలో ఈ ఘటన జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి ఒకరు పోలింగ్ బూత్ సమీపంలో బాంబు విసరడంతో పలువురు గాయాలపాలయ్యారు. దీంతో, తీవ్ర భయాందోళనలకు లోనైన ఇతర ఓటర్లు పరుగులు తీశారు.
ఈ ఘటనలో గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రులకు తరలించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఘటన సమాచారం అందగానే ఆ ప్రాంతానికి చేరుకున్న భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. బాంబు విసిరినది ఎవరో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాయి. పోలింగ్‌కు అడ్డంకి సృష్టించేందుకు ఈ దాడి జరిగిందా? అనే కోణంలో విచారణ చేస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
పశ్చిమబెంగాల్‌లో ప్రస్తుతం తొలి దశలో భాగంగా 152 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. 16 జిల్లాలోని స్థానాలకు జరుగుతున్న అసెంబ్లీ ఈ ఎన్నికల్లో మొత్తం 1,478 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వచ్చే వారం మిగిలిన 142 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమబెంగాల్ అధికార పార్టీ తృణమూల్, ప్రతిపక్ష బీజేపీ ఈ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడుతున్న విషయం తెలిసిందే.
