TG EAPCET-2026 ఇంజినీరింగ్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మే 9 నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలు మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా 125 కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
హైదరాబాద్ మే 7 ( మహాప్రభ ) : TG EAPCET-2026 ఇంజినీరింగ్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్షలు మే 9 నుంచి ప్రారంభం కానుండగా, మే 9, 10, 11 తేదీల్లో మొత్తం 6 సెషన్లలో నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 125 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది మొత్తం 2,10,766 మంది అభ్యర్థులు పరీక్షలకు నమోదు చేసుకున్నారు.
మార్నింగ్ సెషన్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆఫ్టర్నూన్ సెషన్ పరీక్షలు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు ముందుగానే తమ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. హాల్ టికెట్‌లో పేర్కొన్న తేదీ, సెషన్, పరీక్షా కేంద్రాన్ని తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. ఉదయం సెషన్‌కు 7:30 గంటల నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్న సెషన్‌లో పరీక్ష ఉన్నవారిని 1:30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటల తర్వాత, మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంట్రీ ఉండదని తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి ఉండదని హెచ్చరించారు.
అభ్యర్థులు తప్పనిసరిగా బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్, హాల్ టికెట్, ఒరిజినల్ ఫోటో ఐడీ కార్డు వెంట తీసుకురావాలని స్పష్టం చేశారు. కాలిక్యులేటర్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు పరీక్షా కేంద్రాల్లో నిషేధమని స్పష్టం చేశారు. పరీక్ష పూర్తైన వెంటనే అభ్యర్థుల స్క్రీన్‌పై ప్రాథమిక మార్కులు ప్రదర్శిస్తాయని తెలిపారు. అనంతరం ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా నార్మలైజ్డ్ మార్కులు లెక్కించి ర్యాంకులను కేటాయించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
