యువ నటి దివ్యాంక సిరోహి మరణం నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన పాత పోస్ట్ ఒకటి వైరల్‌గా మారింది. 2024, ఆగస్టు 10వ తేదీన దివ్యాంక ఆ పోస్ట్ పెట్టారు.
ఇంటర్‌నెట్ డెస్క్ ఏప్రిల్ 23 (మహాప్రభ) : హర్యాన్వి చిత్రపరిశ్రమకు చెందిన యువ నటి దివ్యాంక సిరోహి కన్నుమూసిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి ఆమె గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 30 ఏళ్లకే గుండె పోటు కారణంగా ఆమె మరణించటంతో చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. దివ్యాంక మరణంపై చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన పాత పోస్ట్ ఒకటి వైరల్‌గా మారింది. 2024, ఆగస్టు 10వ తేదీన దివ్యాంక ఆ పోస్ట్ పెట్టారు. కేధార్‌నాథ్ గుడి దగ్గర దిగిన ఫొటోను ఆమె షేర్ చేశారు. ‘శివ.. నన్ను నీతో తీసుకెళ్లు’ అని రాసుకొచ్చారు. ఆ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘శివుడి దగ్గరకు వెళ్లిపోయింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలి’..‘ఆమె కోరుకున్నట్లుగానే జరిగింది. శివుడు ఆమెను తీసుకెళ్లిపోయాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
దివ్యాంక బ్యాక్‌గ్రౌండ్ ఇది..
దివ్యాంక సిరోహి ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. ఆమె చౌదరీ చరణ్ సింగ్ యూనివర్సిటీ నుంచి బీసీఏ పట్టా పొందారు. సిక్కింలో ఎంబీఏ చేశారు. సినిమాల్లోకి రాకముందు టిక్‌టాక్‌లో వీడియోలు చేసేవారు. ఓ టిక్‌టాక్ వీడియో కారణంగా ఆమె జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది. ఆ వీడియోకు 20 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆ గుర్తింపుతో వీడియో సాంగ్స్ చేసే అవకాశాలు దక్కించుకున్నారు. చనిపోయే వరకు యాభైకిపైగా వీడియో సాంగ్స్ చేశారు. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేశారు.
