ePaper
Wednesday, June 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతి2 ఏళ్లు.. 2 వేల కోట్లు

2 ఏళ్లు.. 2 వేల కోట్లు

📰 Generate e-Paper Clip

రానున్న రెండేళ్లలో రూ.2 వేల కోట్లు ఖర్చు చేసి, ఉత్తరాంధ్రలో 11 కీలక ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నిర్దేశించినట్లు జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.

  • ఉత్తరాంధ్రలో 11 కీలక ప్రాజెక్టులు పూర్తిచేయాలి: నిమ్మల 
  • తక్కువ ఖర్చుతో 5 లక్షల ఎకరాల కొత్త, పాత ఆయకట్టు స్థిరీకరణ
  • సీఎం కృషితో వంశధార ట్రైబ్యునల్‌ తీర్పు గెజిట్‌
  • నేరళ్ల బ్యారేజీ నిర్మాణానికి లైన్‌ క్లియర్‌
  • కరువు ప్రాంతాలకు ప్రయోజనంపై ప్రత్యేక దృష్టి
  • ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష

అమరావతి ఏప్రిల్ 29 (మహాప్రభ) : రానున్న రెండేళ్లలో రూ.2 వేల కోట్లు ఖర్చు చేసి, ఉత్తరాంధ్రలో 11 కీలక ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నిర్దేశించినట్లు జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై మంగళవారం విజయవాడ క్యాంపు ఆఫీసు నుంచి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉత్తరాంధ్రలో కీలకమైన 11 ప్రాజెక్టులు.. వంశధార స్టేజ్‌-2 ఫేజ్‌-2, హిరమండలం రిజర్వాయర్‌, మహేంద్రతనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌, గొట్ట బ్యారేజీ టూ హిరమండలం ఎత్తిపోతల, వంశధార-నాగావళి అనుసంధానం, తోటపల్లి బ్యారేజీ, తారకరామ తీర్థసాగరం, నాగావళి-చంపావతి అనుసంధానం, గజపతినగరం బ్రాంచ్‌ కెనాల్‌, మడ్డువలస రిజర్వాయర్‌ స్టేజ్‌-2, జంఝావతి రిజర్వాయర్‌లను పూర్తిచేస్తే.. 2.69 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 2.49 లక్షల ఎకరాల పాత ఆయకట్టు (మొత్తం 5.18 లక్షల ఎకరాలు) స్థిరీకరణ సాధ్యమవుతుందని చెప్పారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తీసుకురావడంతో పాటు కరువు ప్రాంతాలకు ప్రయోజనం కలిగించే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు వివరించారు. సీఎం పలు దఫాలు ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి, ఒడిసాతో ఉన్న వివాదం, ప్రాజెక్టు ఆవశ్యకతను వివరించడంతో.. కేంద్రం వంశధార ట్రైబ్యునల్‌ 2021లో ఇచ్చిన తీర్పును గెజిట్‌లో చేరుస్తూ నోటిఫికేషన్‌ ఇచ్చిందని.. దీంతో శ్రీకాకుళం జిల్లాలో నేరడి బ్యారేజ్‌ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయని మంత్రి తెలిపారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. చంద్రబాబు చేపట్టిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను, ఉత్తరాంధ్రకు ఎంతో కీలకమైన పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను సైతం జగన్‌ నిలిపేసి.. ఈ ప్రాంతానికి తీవ్ర దోహం చేశారని మంత్రి దుయ్యబట్టారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, ఉత్తరాంధ్ర సీఈ, ఎస్‌ఈ, ఈఈలు, ఇతర అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!