విద్యుత్ వాహనాలను కోనుగోలు చేయదలిచిన వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్ మే 8 ( మహాప్రభ ) : విద్యుత్ వాహనాన్ని కొనుగోలు చేయదలిచిన వారు తమ ఇళ్లల్లోని చార్జింగ్ వసతుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇంటి పరిసరాల్లో విద్యుత్ వాహనాన్ని ఎక్కడ పార్కింగ్ చేయాలనే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. విద్యుత్ కనెక్షన్ అందుబాటులో ఉన్న స్థానంలో వాహనాలను పార్క్ చేయాలి. విద్యుత్ స్కూటీలను ఇంట్లో చార్జింగ్ చేసేందుకు సాధారణ15ఏ సాకెట్ సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ సాకెట్‌కు దగ్గరగా వాహనాన్ని నిలపాలి.
నిపుణులు చెప్పేదాని ప్రకారం, భారతీయ గృహాల్లో విద్యుత్ వసతులు బేసిక్ ఈవీ వాహనాల చార్జింగ్‌కు సరిపోతాయి. అయితే, వైరింగ్ నాణ్యంగా ఉన్నదీ లేనిదీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. ఎర్తింగ్ ఉన్న 15ఏ సాకెట్ సాధారణ చార్జింగ్‌కు ఉపయుక్తం. చాలా సందర్భాల్లో వాహన తయారీదార్లే ప్రత్యేక పోర్టబుల్ చార్జర్‌ను అందిస్తారు. అధిక సామర్థ్యం కలిగిన కార్ల వంటి విద్యుత్ వాహనాలకు ప్రత్యేక ఏసీ వాల్ బాక్స్ చార్జర్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సి రావొచ్చు.
ఇక అపార్ట్‌మెంట్‌లల్లో ఉండే వారు తమ హౌసింగ్ సొసైటీల అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఇంటి నుంచి పార్కింగ్ స్థలం వరకూ ప్రత్యేక వైరింగ్‌ను ఏర్పాటు చేయాల్సి రావచ్చు. ఇలాంటి సమయాల్లో కొందరు ప్రత్యేక సబ్‌మీటర్‌లను కూడా ఏర్పాటు చేసుకుంటారు.
ఇక విద్యుత్ వాహనాలకు సంబంధించి లోడ్ ఫ్యాక్టర్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. విద్యుత్ వాహనాల చార్జింగ్‌తో ఇంటి కనెక్షన్‌పై అదనపు భారం పడుతుంది. వేగవంతమైన చార్జర్‌లను ఇన్‌స్టాల్ చేసుకునేందుకు మీ కనెక్షన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి వస్తే ప్రభుత్వ అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
భద్రత విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని కూడా నిపుణులు చెబుతున్నారు. చార్జింగ్ చేసే సమయంలో ఎక్స్‌టెన్షన్ కార్డ్‌ల వంటి తాత్కాలిక వైరింగ్ జోలికి వెళ్లకూడదు. సాకెట్‌కు అనుసంధానంగా మంచి సర్క్యూట్ బ్రేకర్, రెసిడ్యుల్ కరెంట్ డివైస్ ఉంటే భద్రత మరింత పెరుగుతుంది. వాన, ఎండతో ఇబ్బందులు లేని చోట చార్జింగ్ పాయింట్‌ను ఏర్పాటు చేసుకోవాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు.
భారత్‌లో సాధారణంగా యూజర్లు రాత్రివేళ విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉన్న సమయంలో తమ వాహనాలను చార్జ్ చేస్తుంటారు. ఇక 3 నుంచి 5 కిలోవాట్‌అవర్ సామర్థ్యమున్న స్కూటీ బ్యాటరీలు కొన్ని గంట్లలోనే పూర్తిగా చార్జ్ అవుతాయి. కార్ల వంటి వాటికి మాత్రం వాటి బ్యాటరీ సామర్థ్యం, చార్జర్ రకంపై చార్జింగ్ సమయం ఆధారపడి ఉంటుంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకుంటే ఏ చింతా లేకుండా ఉంటుందని నిపుణుల చెబుతున్నారు.
