మౌత్‌వాష్‌ను ఎక్కువగా వాడటం వల్ల అధిక రక్తపోటు ప్రమాదం పెరగవచ్చని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. నోటిలోని మంచిబ్యాక్టీరియాను ఇది నశింపజేసి, రక్తపోటు నియంత్రణపై ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 21 (మహాప్రభ) : చాలా మంది నోటి పరిశుభ్రత కోసం మౌత్‌వాష్‌ను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా యువతలో దీని వినియోగం పెరిగింది. అయితే మౌత్‌వాష్‌ను ఎక్కువగా వాడటం వల్ల అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) వచ్చే ప్రమాదం పెరగవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
పరిశోధనల ప్రకారం, మన నోటిలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ తయారీలో కీలక పాత్ర పోషిస్తాయి. నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను సడలించి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ బలమైన యాంటీబ్యాక్టీరియల్ మౌత్‌వాష్‌లు ఈ మంచి బ్యాక్టీరియాను కూడా నశింపజేస్తాయి. దీని వల్ల నైట్రిక్ ఆక్సైడ్ స్థాయులు తగ్గి, రక్తపోటు పెరగే అవకాశం ఉంటుంది.
మౌత్‌వాష్‌లు ప్రమాదకరమా?
ప్రతి మౌత్‌వాష్ ప్రమాదకరం కాదు. బలమైన రసాయనాలు ఉన్న మౌత్‌వాష్‌లను అధికంగా వాడితేనే సమస్యలు రావచ్చు. తక్కువ రసాయనాలు ఉన్నవి లేదా డాక్టర్ సూచించినవి పరిమితంగా వాడితే సాధారణంగా ప్రమాదం ఉండదు. పరిశోధనల ప్రకారం, వారానికి ఒకటి లేదా రెండు సార్లు వాడితే పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ రోజుకు పలుమార్లు వాడితే మంచి బ్యాక్టీరియా తగ్గి హై బీపీ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
జాగ్రత్తలు
- రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి.
- ఏడాదికి కనీసం ఒకసారి దంత పరీక్ష చేయించుకోవాలి.
- మౌత్‌వాష్‌ను వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలి.
మౌత్‌వాష్‌ను మితంగా వాడితే ప్రయోజనం ఉంటుంది. కానీ అధికంగా వాడటం వల్ల అనవసర ఆరోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
