మధ్యప్రదేశ్‌లోని బర్గి డ్యామ్‌లో పడవ మునిగిన ఘటనకు సంబంధించి మరో వీడియో వెలుగులోకి వచ్చింది. పడవ మునిగిపోవడానికి కొన్ని నిమిషాల ముందు ఏం జరిగిందో ఆ వీడియోలో ఉంది.
భోపాల్ మే 2 ( మహాప్రభ ) : మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా బర్గి డ్యామ్‌లో పడవ మునిగిన ఘటనకు సంబంధించి మరో వీడియో వెలుగులోకి వచ్చింది. పడవ మునిగిపోవడానికి కొన్ని నిమిషాల ముందు ఏం జరిగిందో ఆ వీడియోలో ఉంది. ఆ వీడియోలో ఏముందంటే.. పడవలోకి నీళ్లు వస్తున్నాయి. భయపడిపోయిన పర్యాటకులు భయంతో కేకలు వేస్తున్నారు. పడవలో కూర్చున్న వారిలో చాలా మందికి లైఫ్ జాకెట్లు లేవు. పడవ సిబ్బంది అప్పటికప్పుడు కొత్త లైఫ్ జాకెట్ల కట్టను అక్కడికి తీసుకువచ్చారు. ఓ వైపు పడవ నీటిలో మునిగిపోతూ ఉంటే.. మరో వైపు వాళ్లు కొత్త జాకెట్లను పంచటం మొదలెట్టారు.
ఐఎమ్‌డీ హెచ్చరికలు చేసినా పట్టించుకోలేదు..
ప్రమాదం జరిగిన సమయంలో పడవలో నలభైకి పైగా మంది పర్యాటకులు ఉన్నారు. వీరిలో 29 మందికి మాత్రమే టికెట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతకు ముందే ఐఎమ్‌డీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. అయినా కూడా పడవ బర్గి డ్యామ్‌లోకి వెళ్లింది. బర్గి డ్యామ్ నర్మదా నదిపై ఉంది. తుఫాను లాంటి బలమైన గాలుల కారణంగా పడవ తిరగబడింది. 6.15 గంటలకు రెస్క్యూ టీమ్‌కు సమాచారం వెళ్లింది. అయితే, సమాచారం అందిన 40 నిమిషాల తర్వాత రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి వచ్చింది. రెండో రెస్క్యూ టీమ్ 7 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక మత్స్యకారులు, రైతులు స్పందించారు. వాళ్లే సహాయక చర్యలు మొదలుపెట్టారు. మత్స్యకారులు, రైతులు వేగంగా స్పందించటం కారణంగా 15 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
