మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. కోతులను తరిమికొట్టడానికి చేసిన ప్రయత్నం ఓ యువకుడి ప్రాణం తీసింది. ఇనుప రాడ్డు హైటెన్షన్ వైర్లను తగలటంతో ఆ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు.
ఇంటర్‌నెట్ డెస్క్ ఏప్రిల్ 15 (మహాప్రభ) : కోతులను తరిమికొట్టడానికి చేసిన ప్రయత్నం ఓ యువకుడి ప్రాణం తీసింది. ఇనుప రాడ్డు హైటెన్షన్ వైర్లను తగలటంతో ఆ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఛతర్‌పూర్‌కు చెందిన ఓ యువకుడు స్థానికంగా ఉండే ఓ హోటల్‌లో సర్వర్‌గా పని చేస్తున్నాడు. నిన్న (మంగళవారం) హోటల్ దగ్గరకు పెద్ద సంఖ్యలో కోతులు వచ్చాయి.
ఆ యువకుడు కోతులను తరిమికొట్టడానికి ఓ పెద్ద ఇనుప రాడ్డును తీసుకున్నాడు. దాన్ని పైకెత్తి వాటిని కొట్టే ప్రయత్నం చేశాడు. భయపడిపోయిన కోతులు అక్కడినుంచి దూరంగా వెళ్లిపోయాయి. ఆ కోతులు మళ్లీ తిరిగిరాకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో.. యువకుడు ఎత్తిన రాడ్డును కిందకు దించకుండా వెనక్కు నడుచుకుంటూ రాసాగాడు. ఈ నేపథ్యంలోనే ఆ రాడ్డు 33 కిలోవాట్స్ హైటెన్షన్ వైర్లను తగిలింది. కరెంట్ షాక్ కారణంగా అతడు క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఆ హోటల్‌లో పని చేసే ఓ అమ్మాయి శబ్ధం విని బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. విగతజీవిగా పడి ఉన్న యువకుడిని చూసి షాక్ అయింది. భయంతో హోటల్‌లోకి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘అందుకే ఏదైనా పని చేసే ముందు వెనకా ముందు చూసుకోవాలి. లేదంటే ఇలా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది’..‘కోతులను కొట్టడానికి అంత పెద్ద రాడ్డు అవసరమా?. అతి చేయటం వల్లే ప్రాణం పోయింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
