ఆర్టీసీ టికెట్ ఇన్‌స్పెక్టర్‌ను కండక్టర్, ప్రయాణికులు చెప్పులతో కొట్టడం సంచలనం రేపింది. టికెట్ లేకుండా బస్సులో ప్రయాణించిన వ్యక్తితో పాటు కండక్టర్‌ను ఆర్టీసీ అధికారి లంచం అడగటంతో ఈ ఘటన జరిగింది.
సంగారెడ్డి జిల్లా మే 1 ( మహాప్రభ ) : ఆర్టీసీ టికెట్ ఇన్‌స్పెక్టర్‌ను కండక్టర్, ప్రయాణికులు చెప్పులతో కొట్టి దాడి చేశారు. నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును రాయికోడ్ వద్ద టికెట్ తనిఖీ చేసిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టికెట్ లేకుండా బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని చెకింగ్ అధికారి గుర్తించారు. ప్రయాణికుడితో పాటు కండక్టర్‌పై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు రూ.20 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అధికారి తీరుపై కండక్టర్‌తో పాటు ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
టికెట్ ఇన్‌స్పెక్టర్ వాహనాన్ని రోడ్డుపైనే ఆపి వాగ్వాదానికి దిగారు. వాదన తీవ్రరూపం దాల్చడంతో అధికారిపై కండక్టర్, ప్రయాణికులు దాడి చేసి, చెప్పులతో కొట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
