కర్నూలు జిల్లా కోడుమూరులో ద్విచక్రవాహనాల దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. వారిలో ఒకరు పట్టుపడగా.. మరొకరు తప్పించుకున్నారు. పట్టుపడిన నిందితుడిని కోడుమూరుకు చెందిన బండారు తేజగా గుర్తించి రిమాండ్‌కు తరలించారు.
కర్నూలు ఏప్రిల్ 11 (మహాప్రభ) : ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఇళ్లల్లోకి దూరి నగలు, బంగారంతో ఉడాయిస్తున్నారు. అందినకాడికి దోచుకుని మెల్లిగా జారుకుంటున్నారు. మరికొన్ని చోట్ల వాహనాలను సైతం వదిలిపెట్టడం లేదు. కార్లు, ద్విచక్రవాహనాలే లక్ష్యంగా చోరీలు చేస్తూ హడలెత్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును కర్నూలు జిల్లా పోలీసులు రట్టు చేశారు.
కోడుమూరులో ద్విచక్రవాహనాల దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. వారిలో ఒకరు పట్టుపడగా.. మరొకరు తప్పించుకున్నారు. పట్టుపడిన నిందితుడిని కోడుమూరుకు చెందిన బండారు తేజగా గుర్తించి రిమాండ్‌కు తరలించారు. పారిపోయిన దొంగను గుంతకల్లుకు చెందిన పవన్‌గా తెలిపారు. అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితుల నుంచి 5 బుల్లెట్ బైకులు, రెండు పల్సర్ బైకులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వీరు బైక్ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ పలు చోరీ కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నట్లు తెలిపారు. మరోవైపు తూర్పుగోదావరి కోరుకొండ మండలం గాదరాడలో శనివారం తెల్లవారుజామున దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లోకి ప్రవేశించి రూ.13 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.30 వేలు దోచుకెళ్లారు. బాధిత కుటుంబసభ్యులంతా ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న సమయంలో వెనుక గది తలుపు పగలకొట్టి దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించే పనిలో ఉంది. అయితే, వారం రోజుల కిందట అదే గ్రామంలో మరో చోరీ జరిగింది. ఓ ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిపై దొంగలు దాడికి పాల్పడ్డారు. అనంతరం దోపిడీ చేసి పారిపోయారు. వారం రోజుల వ్యవధిలోనే రెండు దొంగతనాలు జరగడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తమను దొంగల నుంచి కాపాడాలని కోరుతున్నారు.
