కృష్ణా జిల్లా చల్లపల్లి పేలుడు ఘటన బాధితులను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని డాక్టర్లకు మంత్రి సూచించారు.
అమరావతి, మార్చి 31 (మహాప్రభ) : కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో బాణసంచా ప్రమాద బాధితులను మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) పరామర్శించారు. ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలవడం పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు. మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని డాక్టర్లకు సూచించారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకు మంత్రి హామీ ఇచ్చారు.దీపావళి సమయంలో అక్రమ వ్యాపారం చేసిన వారి వద్ద స్వాధీనం చేసుకున్న టపాసులను తరలిస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని మంత్రి తెలిపారు. ముగ్గురు కూడా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందుతోందన్నారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
ఈరోజు ఉదయం చల్లపల్లి పోలీస్ వాహనంలో పేలుడు సంభవించింది. దీపావళి సందర్భంగా సీజ్ చేసిన టపాసులను పోలీసు వాహనంలో తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. వాహనంలోని టపాసులు ఒక్కసారిగా పేలడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఎస్సై సహా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
