తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో తాము పాల్గొనమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వాకిటి శ్రీహరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మత్తు వదిలించుకోవడానికే మైదానంలోకి రమ్మంటున్నామని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ మార్చి 28 (మహాప్రభ) : తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో తాము పాల్గొనమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వాకిటి శ్రీహరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మత్తు వదిలించుకోవడానికే మైదానంలోకి రమ్మంటున్నామని ఎద్దేవా చేశారు. మైదానంలోకి తాము రామంటూ కేటీఆర్ అంటుంటే ఏం చేయగలమని అన్నారు. ‘మావి వేరే గేమ్స్, కేటీఆర్‌వి మరో రకమైన గేమ్స్’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు మంత్రి.బీఆర్ఎస్ వాళ్లు ఆడే గేమ్స్ పెట్టడం సాధ్యం కాదు కదా? అంటూ చురకలు అంటించారు మంత్రి వాకిటి శ్రీహరి. తాము ఫిట్ తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తున్నామని.. ఆరోగ్య తెలంగాణ ఉండాలని సీఎం ఆలోచన చేస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రజాప్రతినిధులు క్రీడలు ఆడడం వల్ల విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలతో పిల్లలకు డ్రగ్స్ వంటి ఆలోచనలు రాకుండా ఆటల వైపు మళ్లుతారని వాకిటి పేర్కొన్నారు. కాగా, నేటి నుంచి రెండ్రోజులపాటు జరిగే లెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్-2026లో తమ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొనరంటూ ఎమ్మెల్యే కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రజా సమస్యలపై చర్చించకుండా క్రీడా పోటీలు అవసరమా? అంటూ ప్రశ్నించారు కేటీఆర్. శాసనసభ సమయం వృథా చేయడం తగదని.. కనీసం ఇంకో 10 రోజులు సమావేశాలను కొనసాగించాలని అన్నారు. దీనిపై మంత్రి వాకిటి శ్రీహరి స్పందిస్తూ పైవిధంగా కౌంటర్ ఇచ్చారు. కాగా, ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ప్రజాప్రతినిధులకు క్రీడా పోటీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
