కల్తీ పాల ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పాలు, నూనెలు, ఇతర వాటి సేకరణ ఎంతవరకు జరిగింది? ఫలితాలు ఎలా ఉన్నాయి? అని అడిగి తెలుసుకున్నారు.
తూర్పుగోదావరి, ఫిబ్రవరి 23 మహాప్రభ : రాజమహేంద్రవరంలో చోటుచేసుకున్న కల్తీ పాల ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పాలు, నూనెలు, ఇతర వాటి సేకరణ ఎంతవరకు జరిగింది? ఫలితాలు ఎలా ఉన్నాయి? అని అడిగి తెలుసుకున్నారు. నమూనాల సేకరణ, ఫలితాల పరిస్థితి ఏమిటి? అని అధికారులను ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కల్తీ పాల బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.వ్యాపారి నుంచి సేకరించిన పాలు, పాల ఉత్పత్తుల నమూనాలను ప్రయోగశాలలకు పంపించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఫలితాలొచ్చేందుకు 72 గంటల వరకు సమయం పడుతుందని తెలిపారు. ఆసుపత్రుల్లో ఉన్న వారి నుంచి కూడా రక్త నమూనాలు సేకరించి పరీక్షిస్తున్నట్లు చెప్పారు. ఆసుపత్రుల్లో ఉన్న బాధితుల నివాస పరిసర ప్రాంతాల వారి ఆరోగ్య వివరాలనూ సేకరిస్తున్నామన్నారు.కాగా.. మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ అమరావతి నుంచి రాజమహేంద్రవరం బయల్దేరారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం) డైరెక్టర్ నీలకంఠారెడ్డి ఇప్పటికే రాజమహేంద్రవరం వెళ్లారు. పాల వినియోగంపై బాధిత కుటుంబాల వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌లతో నమూనాల సేకరణ, తదుపరి చర్యలపై సమీక్షించారు.
