టీ20 ప్రపంచ కప్ 2026 లీగ్ స్టేజ్‌ను అజేయంగా ముగించిన టీమిండియా.. సూపర్ 8లో తొలి మ్యాచ్‌లోనే బోల్తా పడింది. దీంతో సెమీస్ అవకాశాలు కాస్త సంక్లిష్టమయ్యాయి. దారులైతే పూర్తిగా మూసుకుపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ సెమీ ఫైనల్స్‌కు చేరాలంటే..
ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 23 మహాప్రభ : టీ20 ప్రపంచ కప్ 2026 లీగ్ స్టేజ్‌ను అజేయంగా ముగించిన టీమిండియా.. సూపర్ 8లో తొలి మ్యాచ్‌లోనే బోల్తా పడింది. గ్రూప్ దశలో అసోసియేట్ దేశాలపై కాస్త తడబడినా గెలుపు ముగింట నిలవడంతో ఊపిరి పీల్చుకున్నాం. కానీ బలమైన సౌతాఫ్రికాపై విజయం సాధించేందుకు భారత జట్టు చెమటోడ్చింది. అయినా.. 76 పరుగుల భారీ తేడాతో సఫారీలపై ఓటమిని చవిచూసింది. దీంతో టీ20 ప్రపంచ కప్ మ్యాచుల్లో టీమిండియా వరుస విజయాలకు(12) బ్రేక్ పడింది. అయితే సెమీస్ అవకాశాలు మాత్రం కాస్త సంక్లిష్టమయ్యాయి. దారులైతే పూర్తిగా మూసుకుపోలేదు. కానీ టీమిండియా ప్రధాన కోచ్ గంభీర్ వ్యూహాత్మక ప్రయోగాలు.. ఆటగాళ్ల తీరు మారకపోతే మాత్రం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ సెమీ ఫైనల్స్‌కు చేరాలంటే..
అదే జరిగితే..
టీమిండియాపై విజయంతో సౌతాఫ్రికా 2 పాయింట్లతో గ్రూప్ 1లో తొలి స్థానంలో నిలిచింది. భారీ పరుగుల అంతరాయంతో ఓడటంతో టీమిండియా నెట్ రన్‌రేట్ -3.800గా ఉంది. సూపర్ 8లో భారత్.. జింబాబ్వే, వెస్టిండీస్ జట్లతో మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే టీమిండియా ఈ రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించాలి. అప్పుడు భారత్ ఖాతాలోకి 4 పాయింట్లు వస్తాయి.అదే సమయంలో జింబాబ్వే, వెస్టిండీస్ ఖాతాల్లో 4 పాయింట్లు ఉండకూడదు. అలా అయితేనే భారత్ సెమీస్‌కు వెళ్తుంది. ఈ లెక్కన చూస్తే.. సౌతాఫ్రికా సెమీ ఫైనల్‌కు వెళ్లడం ఖాయం అనిపిస్తోంది.మిగిలిన రెండు మ్యాచుల్లో ఒకవేళ టీమిండియా.. ఒకదాంట్లోనే విజయం సాధిస్తేనే పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారుతుంది. ఈ సందర్భంలో దక్షిణాఫ్రికా మిగిలిన తన రెండు మ్యాచుల్లో కచ్చితంగా విజయం సాధించాలి.వెస్టిండీస్-జింబాబ్వేకు మధ్య జరగనున్న మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టును భారత్ ఓడించాల్సి ఉంటుంది. అప్పుడు భారత్, జింబాబ్వే, వెస్టిండీస్ ఖాతాల్లో చెరో రెండు పాయింట్లు ఉంటాయి. నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉన్న జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. కాబట్టి ప్రతి మ్యాచ్‌లో టీమిండియాకు నెట్ రన్‌రేట్ కీలకం కానుంది. భారత్ కాస్త ఒత్తిడి లేకుండా సెమీస్ వెళ్లాలంటే.. జరగనున్న రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించి తీరాల్సిందే!
