భారత ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం చేరుకున్నారు. చైనా సరిహద్దులో ఏర్పాటుచేసిన అత్యవసర ల్యాండింగ్ ఫెసిలిటీలోనే ఆయన విమానం దిగింది.
ఇంటర్నెట్ డెస్క్, ఫిబ్రవరి 14 మహాప్రభ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. అస్సాం పర్యటన నిమిత్తం అక్కడకు చేరుకున్నారు. దిబ్రూగఢ్ – మోరాన్ జాతీయ రహదారిపై నిర్మించిన అత్యవసర ల్యాండింగ్ ఫెసిలిటీ రోడ్డుపై మోదీ ప్రయాణించిన ప్రత్యేక విమానం దిగింది. దీంతో అస్సాంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైనట్టయింది. ఆ తర్వాత.. మోదీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఏర్పాటుచేసిన యుద్ధ, రవాణా, ఎయిర్‌క్రాఫ్ట్‌ల వైమానిక ప్రదర్శనను వీక్షించారు. ఈ ఈఎల్ఎఫ్ గురించి ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్ట్ చేశారు. క్లిష్ట సమయంలో సహాయ కార్యకలాపాలకు, అత్యవసర ప్రతిస్పందనకు ఈ ఫెసిలిటీ కీలకం కానుందని పేర్కొన్నారు మోదీ.ఈశాన్య భారతదేశంలో ఏర్పాటుచేసిన ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ(ELF).. చైనా సరిహద్దుకు 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇటీవల నిర్మించిన 4.2 కిలోమీటర్ల ఈ హైవేపై రఫేల్, సుఖోయ్ వంటి యుద్ధ విమానాలను ల్యాండ్ చేయవచ్చు. అంతేకాకుండా.. అత్యవసర పరిస్థితుల్లో సైనిక, పౌర విమానాలను దింపేందుకూ ఇది ఉపయుక్తం కానుంది. దిబ్రూగఢ్ ఎయిర్‌పోర్ట్, చబువా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లలో కార్యకలాపాలు నిర్వహించలేని సందర్భాల్లో దీనిని ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు.
దీంతో సరిహద్దు ప్రాంతాల్లో ఏమైనా ఉద్రిక్తతలు నెలకొన్నప్పుడు.. భారత వాయుసేన వేగంగా స్పందించేందుకూ మార్గం సుగమం కానుంది. టేకాఫ్, ల్యాండింగ్ రెండింటికీ అనుకూలంగా ఈ ఫెసిలిటీని డిజైన్ చేశారు. పశ్చిమ, ఉత్తర, మధ్య భారతంలో ఇప్పటికే ఈ ఈఎల్‌ఎఫ్‌లు ఉన్నాయి.
