టీ20 ప్రపంచకప్ తమ తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో తడబాటుకు లోనైన టీమిండియా బ్యాటర్లు.. తదుపరి పోరులో జూలు విదల్చాలనుకొంటున్నారు. గ్రూప్-ఎలో గురువారం జరిగే తమ రెండో మ్యాచ్‌లో పసికూన..
అభిషేక్ దూరం.. ఓపెనర్‌గా శాంసన్?
న్యూఢిల్లీ ఫిబ్రవరి 12 మహాప్రభ : టీ20 ప్రపంచకప్ తమ తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో తడబాటుకు లోనైన టీమిండియా బ్యాటర్లు.. తదుపరి పోరులో జూలు విదల్చాలనుకొంటున్నారు. గ్రూప్-ఎలో గురువారం జరిగే తమ రెండో మ్యాచ్‌లో పసికూన నమీబియాతో డిఫెండింగ్ చాంపియన్ భారత్ తలపడనుంది. బలాబలాలపరంగా చూస్తే టీమిండియాకు నమీబియా ఏమాత్రం సరితూగే ప్రత్యర్థికాదు. కానీ, ఆదివారం పాకిస్థాన్‌తో జరగబోయే మ్యాచ్‌కు ముందు నమీబియాతో పోరును వామ్‌పగా పరిగణించాలి. అయితే, కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన ఓపెనర్ అభిషేక్ వర్మ డిశ్చార్జ్ అయ్యాడు. కానీ, అతడిని ఆడించే అవకాశాలు తక్కువే. ఈ నేపథ్యంలో అభిషేక్ స్థానంలో సంజూ శాంసన్‌కు చాన్స్ లభించవచ్చు. అనారోగ్యం నుంచి కోలుకొన్న పేసర్ బుమ్రా బరిలోకి దిగనుండడం శుభ పరిణామం. కెప్టెన్ సూర్యకుమార్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. పాక్‌తో మ్యాచ్‌కు ముందు ఓపెనర్ ఇషాన్ కిషన్, తిలక్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ టచ్‌లోకి రావడం ఎంతో ముఖ్యం. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి స్పిన్ విభాగాన్ని నడిపించనున్నారు. మరోవైపు నమీబియా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకోవాలనుకొంటోంది. కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్, ఆల్‌రౌండర్ జేజే స్మిత్ మినహా జట్టులో చెప్పుకోదగ్గ బ్యాటర్లు లేరు.
జట్లు (అంచనా)
భారత్: అభిషేక్/సంజూ శాంసన్, ఇషాన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివం దూబే, అక్షర్, అర్ష్‌దీప్, బుమ్రా/సిరాజ్, వరుణ్ చక్రవర్తి.
నమీబియా: లోరెన్ స్టీన్‌కాం్‌ప, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్, గెరార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జేజే స్మిత్, జేన్ గ్రీన్ (వికెట్ కీపర్), డ్యాలన్ లీచర్, విలియం మోబర్గ్, రూబెన్ ట్రంపెల్మన్, బెర్నార్డ్ షోల్జ్, బెన్ షికోంగో.
పిచ్/వాతావరణం
ఫిరోజ్ కోట్లా మైదానంలో బుధవారం ఉదయం 11 గంటలకు జరిగిన మ్యాచ్‌లో ఓ మాదిరి స్కోర్లు నమోదయ్యాయి. అయితే, రాత్రి జరిగే మ్యాచ్‌లోనూ పిచ్ ఇదేవిధంగా మందకొడిగా ఉంటుందా? అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. బ్యాటింగ్ బలాన్ని చాటాలనుకొంటున్న టీమిండియా.. తొలుత బ్యాటింగ్ చేయడానికే మొగ్గుచూపొచ్చు. వాతావరణం సాధారణంగా, పొడిగా ఉండనుంది.
