ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన కోరం రామారావు అనే వ్యక్తి సైబర్ నేరగాళ్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ములుగు, ఫిబ్రవరి 9, మహాప్రభ : సైబర్ నేరగాళ్ల వేధింపులు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. మూడు రోజులుగా సాగుతున్న మానసిక వేధింపులను తట్టుకోలేక ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన కోరం రామారావు అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఏం జరిగిందంటే..?
మృతుడు రామారావు రాసిన సూసైడ్ నోట్ ప్రకారం, సైబర్ నేరగాళ్లు ఆయన ఫోన్‌ను హ్యాక్ చేశారు. గత మూడు రోజులుగా నిరంతరం ఫోన్ చేస్తూ, మానసిక ఒత్తిడికి గురిచేస్తూ వేధింపులకు పాల్పడ్డారు. ఈ వేధింపులు భరించలేక రామారావు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ.. పరిస్థితి విషమించడంతో రామారావు మృతి చెందారు.
సూసైడ్ నోటులో సంచలన విషయాలు..
చనిపోయే ముందు రామారావు రాసిన నోటు ఇప్పుడు కలకలం రేపుతోంది. తన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి, ఫోన్ హ్యాక్ చేసి వేధిస్తున్నట్లు పేర్కొన్నారు. తన ప్రాణం పోవడానికి కారణమైన సైబర్ నేరగాళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆవేదనతో నోటులో కోరారు. రామారావు మృతితో తిప్పాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
