పల్నాడు జిల్లా మాచర్ల ఏఎస్సై శ్రీనివాసరావుపై సస్పెషన్ వేటు పడింది. విద్యార్థినిలు, మహిళలను వేధిస్తుండడంతో ఉన్నతాధికారులు అతనిపై చర్యలు తీసుకున్నారు.
పల్నాడు జిల్లా ఏప్రిల్ 11 (మహాప్రభ) : పోలీసులంటే సమాజానికి రక్షణగా నిలిచే కవచం లాంటి వారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సంఘ విద్రోహ శక్తులను ఎప్పుడూ అడ్డుకుంటుంటారు. ఎలాంటి సందర్భం ఎదురైనా ప్రజలకు తామున్నామంటూ రక్షణగా నిలుస్తుంటారు. అలాంటి పోలీసులే గాడి తప్పితే సమాజం ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా అలాంటి పనే చేసిన ఓ పోలీసు.. ఆ వృత్తికే కళంకంగా మారాడు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో చివరికి సస్పెషన్‌కు గురయ్యాడు. అతను చేసిన పని చూసి డిపార్ట్మెంట్ మెుత్తం ముక్కున వేలేసుకుంటోంది.
మాచర్ల ఏఎస్సై శ్రీనివాసరావుపై సస్పెషన్ వేటు పడింది. విద్యార్థినిలు, మహిళలను వేధిస్తుండడంతో ఉన్నతాధికారులు అతనిపై చర్యలు తీసుకున్నారు. నియోజకవర్గంలో పర్యాటక ప్రదేశాలకు వెళ్లే విద్యార్థినిలు, మహిళలను టార్గెట్ చేశాడు ఏఎస్సై శ్రీనివాసరావు. ప్రేమ జంటల వీడియోలు తీసి బెదిరింపులకు దిగేవాడు. అడిగినంత డబ్బు ఇవ్వాలని, ఆపై తన కోరిక తీర్చాలని బెదిరించేవాడు. తాను చెప్పినట్లు వినకపోతే వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ హెచ్చరించేవాడు. మాచర్ల మండలానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ కూడా ఏఎస్సైకు సహకరించాడు. వీడియోలు తీసి శ్రీనివాసరావుకు పంపేవాడు.
వీరిద్దరూ కలిసి ఈ దందా నిర్వహించేవారు. ఇటీవల స్థానిక వ్యాపారి ఒకరు ఓ మహిళతో వెళ్లారు. వారిద్దరు సన్నిహితంగా ఉన్న వీడియోలను తీసి నగదు వసూలు చేశారు. పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉండడం, అతని ఆగడాలు పెరిగిపోవడంతో పాపం పండింది. ఏఎస్సై వీడియోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో వారి దందా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో విచారణ చేపట్టి ఏఎస్సై శ్రీనివాసరావును విధుల నుంచి తొలగించారు.
