ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై ఎమ్మెల్యే ప్రశ్నించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పటి వరకు కోటి 40 లక్షల మంది ప్రజలు సేవలు పొందారని మంత్రి సమాధానం ఇచ్చారు.
అమరావతి, ఫిబ్రవరి 27 మహాప్రభ : ఏపీ శాసనసభలో (AP Assembly Session) మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై ఎమ్మెల్యే వాల్మీకి పార్థసారథి అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేశ్ (Minister Nara lokesh) సమాధానమిచ్చారు. ప్రస్తుతం 943 రకాల సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు కోటి 40 లక్షల మంది ప్రజలు ఈ సేవలను పొందారని వివరించారు. వాట్సాప్ గవర్నెన్స్‌కు కృత్రిమ మేధస్సును జోడించి యూజర్ ఫ్రెండ్లీగా మార్చామని చెప్పారు.ఉన్న సౌకర్యాలను ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునేలా చేశామని తెలిపారు. ఈ వ్యవస్థను మరింత ఆధునీకరించాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. వేగంగా స్పందించడం, రసీదులు తక్షణమే అందించడం వంటి అంశాలపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. సభ్యులు క్షేత్రస్థాయి పరిస్థితులపై ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలన్నారు. మనమిత్ర 2.0ను త్వరలో ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని మంత్రి లోకేశ్ సభలో వెల్లడించారు.
చేనేత కార్మికుల సంక్షేమంపై…
చేనేత కార్మికుల సంక్షేమంపై అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు ప్రశ్న లేవనెత్తగా.. మంత్రి సవిత సమాధానమిచ్చారు. వ్యవసాయం తర్వాత అత్యధిక మంది చేనేత రంగంపై ఆధారపడ్డారని తెలిపారు. చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలతో పాటు అండగా నిలుస్తున్నామని చెప్పారు. వైసీపీ హయాంలో చేనేత సంక్షేమ పథకాలు రద్దు చేశారని.. థ్రిఫ్ట్ నిధులను నిలిపివేశారని ఆరోపించారు. ప్రస్తుతం 50 ఏళ్లు దాటిన చేనేత కార్మికులందరికీ నెలకు రూ.4 వేల పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. 93 వేల మంది చేనేత కార్మికులు ఈ పెన్షన్ పొందుతున్నారని మంత్రి వివరించారు.ఏప్రిల్ నుంచి పవర్ లూం, హ్యాండ్ లూంలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. వడ్డీ భారం తగ్గించేందుకు పావలా వడ్డీకే రుణాలు అందిస్తున్నామన్నారు. ముడి సరుకు సరఫరాపై 15 శాతం రాయితీ ఇస్తున్నామని, ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద చేనేతలకు 10 అవార్డులు వచ్చాయని చెప్పారు. వైసీపీ హయాంలో కేంద్రం నుంచి అప్కో పేరిట రూ.120 కోట్లు తెచ్చి దారి మళ్లించారని, దీనివల్ల చేనేత కార్మికులు ఇబ్బంది పడ్డారని మంత్రి సవిత సభలో తెలియజేశారు.
