టీడీపీ నేతలకు ఏపీ మంత్రి నారా లోకేశ్ పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీ పరంగా నేతలంతా ఏబీసీ ఫార్ములా అనుసరించాలని మార్గనిర్దేశం చేశారు. సరైన ప్రణాళికతో నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు.
అమరావతి, ఫిబ్రవరి 14 మహాప్రభ : టీడీపీ నేతలకు ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీ పరంగా నేతలంతా ఏబీసీ ఫార్ములా అనుసరించాలని మార్గనిర్దేశం చేశారు. సరైన ప్రణాళిక (Always be campaign) అనే ఈ ఫార్ములాతో నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. పార్టీ నిర్ణయం తీసుకునే ముందు వరకూ ఎవరు ఎంతైనా తమ అభిప్రాయాలు బలంగా వినిపించవచ్చని పేర్కొన్నారు. ఒకసారి పార్టీ నిర్ణయం జరిగాక నేతలు ఎవరైనా దానికి కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అసెంబ్లీలో శుక్రవారం మీడియాతో నారా లోకేశ్ మాట్లాడారు. ఈనెల 28వ తేదీన యలమంచిలిలో శంకుస్థాపన చేసే బ్లూ జెట్ పరిశ్రమ ద్వారా రూ.2300కోట్ల పెట్టుబడి ఏపీకి రానుందని చెప్పుకొచ్చారు.
మానవీయ సంబంధాలు ముఖ్యం..
ఏఐ, క్వాంటం ఎంత ముఖ్యమో మానవీయ సంబంధాలు కూడా అంతే ముఖ్యమని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. యువగళం పాదయాత్ర ముగిశాక టీడీపీ నేతలందరితో సరదాగా మాట్లాడేవాడినని, అధికారంలోకి వచ్చాక కూడా ఆ హ్యూమన్ రిలేషన్ మిస్ కాకూడదని నిర్ణయించానని అన్నారు. తనకు నాయకులు అంతా తెలుసు కానీ వారి కుటుంబ సభ్యులు కొంతమంది తెలీదని చెప్పుకొచ్చారు. నేతల కుటుంబాలతో బంధం బలోపేతం కోసమే డిన్నర్ సమావేశాలు నిర్వహించామని స్పష్టం చేశారు. ఏపీ బడ్జెట్ సమావేశాలప్పుడైనా ఇలా నేతలందరితో ప్రతీ ఏడాది కలిసేలా ప్రణాళిక చేసుకున్నానని తెలిపారు.
ఇంకో 2కిలోలు బరువు తగ్గాలి..
రాత్రి 9:30 దాటినా ఆత్మీయ సమావేశం నుంచి కదిలేందుకు నేతలు ఇష్టపడలేదని మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. అంత సరాదాగా సమయం తెలియకుండా గడిచిపోయిందన్నారు. బరువు మరీ ఎక్కువ తగ్గుతున్నానని అంతా అంటున్నారని, ఇంకో 2కిలోలు బరువు తగ్గితే తన లక్ష్యం పూర్తవుతుందని తెలిపారు. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవటం ప్రతిపక్షంలో అలవాటైందని పేర్కొన్నారు. రాజకీయంగా సిద్ధాంతాలు ఎంత అవసరమో నేతలతో హ్యూమన్ టచ్ అంతే అవసరమని తెలిపారు. ఈ విషయం ప్రధాని మోదీ నుంచే నేర్చుకున్నానని వివరించారు. మోదీ ప్రధానిగా ఎంత బిజీగా ఉన్నా నేతలు ఎవరికైనా బాగోపోతే పర్సనల్‌గా ఫోన్ చేసి వారి బాగోగులు తెలుసుకుంటారనేది కొందరికే తెలుసునని చెప్పుకొచ్చారు. క్వాంటం, ఏఐలని సీఎం చంద్రబాబు చూసుకుంటారని, తాను మానవీయ సంబంధాలు చూసుకుంటానని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
