పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసుపై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ లతో కూడిన ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది.

ఢిల్లీ, ఫిబ్రవరి 6 మహాప్రభ : తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు (MLA Defection Case) విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) మూడు వారాల పాటు వాయిదా వేసింది. న్యాయస్థానంలో ఈరోజు జరిగిన విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌లతో కూడిన ధర్మాసనం.. బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వద్ద విచారణ ప్రస్తుతం కొనసాగుతోందని కోర్టుకు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మరో మూడు వారాల సమయం కావాలని ఆయన కోరారు.
సుప్రీంకోర్టు స్పందన..
అసెంబ్లీ స్పీకర్‌కు ఇప్పటికే తగినంత సమయం ఇచ్చామని గతంలోనే గుర్తు చేసిన ధర్మాసనం, ఈసారి స్పీకర్ నిర్ణయం పాజిటివ్‌గా (సానుకూలంగా) ఉండాలని స్పష్టం చేసింది. సింఘ్వీ విన్నపాన్ని మన్నిస్తూ, తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఆ సమయానికి స్పీకర్ తీసుకున్న నిర్ణయాల పూర్తి సమాచారాన్ని సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పిటిషన్ దాఖలు చేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ..
బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఈ వ్యవహారంలో స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ అమలు చేయలేదని మహేశ్వర్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆయన దాఖలు చేసిన ఈ ధిక్కరణ పిటిషన్‌ను కూడా ప్రధాన పిటిషన్‌తో కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మూడు వారాల గడువులోగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. కోర్టు పర్యవేక్షణలో ఉన్న ఈ కేసు తెలంగాణ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
