ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఅంతర్జాతీయంహోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా భీకర దాడులు

హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా భీకర దాడులు

📰 Generate e-Paper Clip

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి వద్ద పట్టు సాధించేందుకు అమెరికా దూకుడు ప్రదర్శిస్తోంది. ఇరాన్‌కు చెందిన వ్యూహాత్మక భూగర్భ క్షిపణి స్థావరాలే లక్ష్యంగా అగ్రరాజ్యం ‘బంకర్ బస్టర్’ బాంబులతో విరుచుకుపడింది.

మార్చి18 మహాప్రభ : పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద పట్టు సాధించేందుకు అమెరికా సరికొత్త యుద్ధ తంత్రాన్ని అమలుచేస్తోంది. ఇరాన్ ఆధీనంలో ఉన్న వ్యూహాత్మక భూగర్భ క్షిపణి స్థావరాలే లక్ష్యంగా అగ్రరాజ్యం ‘బంకర్ బస్టర్’ బాంబులతో విరుచుకుపడింది.అంతర్జాతీయ నౌకాయానానికి ముప్పుగా మారిన ఇరాన్ యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణులను అడ్డుకునేందుకు ఈ దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. ఈ దాడిలో దాదాపు 2,200 కిలోల బరువున్న అత్యంత శక్తిమంతమైన బంకర్ బస్టర్ బాంబులను అమెరికా ప్రయోగించింది.

ట్రంప్ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే..

హోర్ముజ్ జలసంధికి యుద్ధ నౌకలను పంపే విషయంలో నాటో (NATO), ఇతర మిత్రదేశాలు వెనకడుగు వేశాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. మిత్రదేశాల సహకారం లేకపోయినా, ఒంటరిగానే ఇరాన్‌ను ఎదుర్కొంటామనే సంకేతాన్ని అమెరికా ఈ చర్యతో పంపింది.సాధారణ బాంబులు భూ ఉపరితలంపై మాత్రమే ప్రభావం చూపుతాయి. కానీ, బంకర్ బస్టర్లు భూమిలోకి లోతుగా చొచ్చుకుపోయి, అక్కడున్న కాంక్రీట్ కట్టడాలను, భూగర్భ స్థావరాలను ధ్వంసం చేస్తాయి. 2022 గణాంకాల ప్రకారం, ఒక్కో బాంబు తయారీకి దాదాపు 2.88 లక్షల డాలర్లు (సుమారు రూ. 2.6 కోట్లు) ఖర్చవుతుంది. గతేడాది ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నప్పుడు అమెరికా ఏకంగా 13,600 కిలోల భారీ బాంబులను ఉపయోగించింది.ఈ దాడుల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి గుండా జరిగే చమురు సరఫరాకు ఆటంకం కలిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇరాన్ దీనిపై ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ రేపుతోంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!