ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరుగుతోంది.

అమరావతి, ఫిబ్రవరి 4 మహాప్రభ : సీఎం చంద్రబాబు నాయుడితో (CM Chandrababu Naidu) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) భేటీ అయ్యారు. ఈరోజు (బుధవారం) ఉదయం సీఎం నివాసానికి చేరుకున్నారు పవన్. అనంతరం ఇద్దరి మధ్య సమావేశం మొదలైంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, సున్నితమైన అంశాలపై విపక్షం రెచ్చగొట్టే ప్రయాత్నాలు, తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజ్యసభ ఎన్నికలు, నియామక పదవులు, కూటమి పక్షాల సమన్వయం, వైసీపీ విషప్రచారాన్ని తిప్పికొట్టడంపై చర్చించనున్నట్లు సమాచారం.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈ సమావేశంలో చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది. తిరుమలకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్న నేపథ్యంలో.. వారి మనోభావాలను గౌరవించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్‌డీడీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే గతంలో సీఎం మాట్లాడటం, విచారణకు ఆదేశించడం, అలాగే ఈ అంశంపై సుప్రీం కోర్టుకు పలువురు వెళ్లగా సీబీఐ నేతృత్వంలో సిట్ ఏర్పాటై ఈ వ్యవహారంపై విచారించడం జరిగింది. సిట్ తన నివేదికను కేబినెట్ ముందు ఉంచగా నిన్న (మంగళవారం) ఈ అంశంపై మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. నెయ్యి కల్తీ జరగడం వాస్తవమని తేలడంతో.. ఇందులో ఎవరు సూత్రధారులు అనేదానిపై కేబినెట్‌లో చర్చించడంతో పాటూ కల్తీకి ఆస్కారం ఇచ్చిన వారంతా బాధ్యులే అని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.
