జీవకారుణ్యం– భారతీయ సంస్కృతికి కొత్త విషయం కాదు. ఓ దేవతకు మేకను బలి ఇవ్వబోతున్న కొందరిని చూసి.. దానిని వదిలేయాలని, అంతగా అయితే తనను బలి తీసుకోవచ్చని…
మహాప్రభ – జీవకారుణ్యం– భారతీయ సంస్కృతికి కొత్త విషయం కాదు. ఓ దేవతకు మేకను బలి ఇవ్వబోతున్న కొందరిని చూసి.. దానిని వదిలేయాలని, అంతగా అయితే తనను బలి తీసుకోవచ్చని గౌతమ బుద్ధుడు దాదాపు 2,600 ఏళ్ల కిందటే చెప్పిన చరిత్ర మనది. తనను వేటాడుతున్న డేగ నుంచి కాపాడమని ఓ పావురం శిబి చక్రవర్తిని ఆశ్రయిస్తే.. ఆ పావురానికి సమానమైన బరువున్న మాంసాన్ని తన తొడ నుంచి కోసి డేగకు ఇచ్చిన శిబి చక్రవర్తి కథ మన పురాణాల్లో ఉంది. అరణ్యాలను రక్షించుకోవటానికి 1970ల నాటి చిప్కో ఉద్యమకారులు చెట్లను ఆలింగనం చేసుకొని.. వాటిని కూల్చే ముందు తమను నరికివేయాలని సవాల్ విసిరారు. కానీ, నేడు జంతు ప్రేమికులు, ముఖ్యంగా కొందరు కుక్కల ప్రేమికుల ధోరణి చూస్తుంటే.. తమ ప్రాణాలు అడ్డుపెట్టటం అటుంచి.. సాటి మనుష్యుల ప్రాణాలు పోయినా ఫర్వాలేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వారి వాదనలు, మాటలు వింటుంటే అలాంటి అభిప్రాయమే కలుగుతోంది.
వీధి కుక్కల దాడుల్లో అత్యంత దారుణంగా చిన్న పిల్లలు గాయపడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. పెద్దలూ కుక్కల దాడికి గురవుతున్నారు. వీధుల్లో రాత్రి పూట సంగతి దేవుడెరుగు.. పగటి పూట నడిచి వెళ్లాలన్నా కుక్కల మందలను చూసి జంకే పరిస్థితి నెలకొంది. నైట్‌షిఫ్టు ఉండే మీడియా, ఐటీ, డెలివరీ వంటి ఉద్యోగులైతే.. ఏ అర్ధరాత్రో ఇంటికి వెళ్తున్నప్పుడు కుక్కల భయానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. గత ఐదేళ్లలో ఒక్క తెలంగాణలోనే కుక్క కాటు బాధితులు 14,88,781 అని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పలు గ్రామాల్లోని ప్రజలు.. కుక్కల బెడదను తప్పించాలని అభ్యర్థులను కోరారు. ఏపీలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. వీధి కుక్కల సమస్య ఓ సామాజిక సమస్యగా మారింది. దీనికి బలవుతున్న వారిలో అత్యధికులు నిరుపేదలు, దిగువ మధ్యతరగతివారు. ఇంటి చుట్టూ ప్రహరీ కట్టుకోలేని గుడిసె వాసి తన పిల్లల్ని కుక్కల బారి నుంచి ఎలా కాపాడుకోగలడు? ఈ సమస్యపై ఇన్నాళ్లకు సుప్రీంకోర్టు దృష్టి పెట్టి.. బడులు, ఆస్పత్రులు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు వంటి పబ్లిక్ ప్లేసుల్లో వీధి కుక్కలు ఉండకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను ఆదేశిస్తే.. దానికి వ్యతిరేకంగా బోలెడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇటీవల విచారణ సందర్భంగా.. సుప్రీంకోర్టు జడ్జిల్లో ఒకరు.. వీధి కుక్కల గురించి వాదించే లాయర్లు కోర్టు హాల్లో ఇంతమంది ఉన్నారుగానీ.. మనుష్యుల ప్రాణాల గురించి వాదించేవారు మాత్రం కనిపించటం లేదని ఆశ్చర్యపోయారు.
విచిత్రమేమిటంటే, కుక్కల దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్న వాళ్లు, గాయపడుతున్నవాళ్లు ప్రభుత్వాలకు పన్ను కడుతున్న ప్రజల్లో ఓ భాగం. అంటే ప్రభుత్వాల్ని, ప్రభుత్వ పథకాల్ని వారు పోషిస్తున్నారు. ఓటు వేసి ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నారు. కానీ, వారి ప్రాణాలకు కుక్కల దాడుల నుంచి ఎటువంటి హామీ లేదు. ఏ పన్నూ కట్టని వీధి కుక్కల ప్రాణాలకు మాత్రం జంతు సంరక్షణ చట్టాలున్నాయి. కుక్కను కొడితే కేసు, ప్రాణం తీస్తే కేసు, జైలుశిక్ష. కుక్కలపై దాడి చేసిన వ్యక్తిని చట్టాల ప్రకారం శిక్షిస్తున్నారు. మరి, వీధి కుక్క దాడి చేసి ఓ చిన్న పిల్లాడిని చంపినప్పుడో, అనేక మందిని కరిచినప్పుడో ఎవరినీ శిక్షించటం లేదేం? కుక్కల నుంచి మనుష్యులను రక్షించే చట్టాలు ఉండొద్దా? కుక్క దాడి చేసినప్పుడు శిక్ష ఎవరికి విధించాలి? ఆ కుక్కకా? కుక్కల ప్రేమికులకా? వీధి కుక్కల దాడిలో గాయపడినవారికి ప్రభుత్వాలు, జంతుప్రేమికులు పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘వీధి కుక్కల మీద అంత ప్రేమ ఉంటే ఇళ్లలోకి తీసుకెళ్లి పెంచుకోండి’ అని సూచించింది. కుక్కల ప్రేమికులు ఈ బాధ్యత ఎందుకు తీసుకోరు? కుక్కలపై వారి ప్రేమ కోసం అమాయక చిన్నారులు, జనం తమ ప్రాణాలతో మూల్యం చెల్లించాలా?
వీధి కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయించి, ఎక్కడి నుంచైతే వాటిని తీసుకెళ్లారో అదే ప్రాంతంలో తిరిగి విడిచిపెట్టాలని కుక్కల ప్రేమికులు చెబుతుంటారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం కూడా ఇదే. దీంట్లో ఉన్న సమస్య ఏమిటో చూద్దాం. స్వాతంత్ర్యానంతరం మన దేశంలో జనాభా నియంత్రణ కోసం సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయించుకోవాలని ప్రభుత్వాలు పెద్దఎత్తున ప్రచారం చేశాయి. ఆ ప్రచారం ప్రజలను చేరి, ఫలితాలు రావటానికి దశాబ్దాలు పట్టింది. అది కూడా దక్షిణాది రాష్ట్రాల్లోలాగా ఉత్తరాదిన సమర్థవంతంగా అమలు కాలేదు. మనుష్యుల్లోనే ఈ పరిస్థితి ఉంటే కుక్కల్లో సంతాన నిరోధక ఆపరేషన్లు పూర్తిగా అమలయ్యేది ఎప్పుడు? ఒకవేళ అమలైనా.. ఒక్కో కుక్క జీవితకాలం సగటున పదేళ్లు అనుకుంటే.. ఈ పదేళ్లపాటు అది అప్పుడప్పుడు కరిచినా, చిన్నారుల్ని చంపినా భరించాల్సిందేనా? కుక్కల ప్రేమికుల వాదన ప్రకారం.. వాటికీ జీవించే హక్కు ఉంది. నిజమే! మరి, మనుష్యులకూ ఉంది కదా. కుక్కల ప్రేమికుల మరో వాదన.. ‘డెంగ్యూ వంటి దోమకాటు వ్యాధుల్లో, రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది జనం మరణిస్తున్నారు.. వాటి మీద మాట్లాడకుండా వీధి కుక్కల మీదే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు?’ అన్నది. దీనికి సమాధానం– ప్రతి ఆదివారం మన దేశంలో కొన్ని కోట్ల కోళ్లు, మేకలు ప్రాణాలు కోల్పోయి.. మనుష్యుల ఆహారంగా మారిపోతాయి కదా.. మరి, మాంసాహారాన్ని నిషేధించాలని జంతు ప్రేమికులు ఉద్యమించగలరా? కుక్కల ప్రాణాలకే ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు?!
ఊహా ప్రపంచంలో (ఉటోపియాలో) ఉంటే వాస్తవ ప్రపంచంలో జీవించగలమా? మన దేశంలో, మన రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులేమిటన్నదాన్ని బట్టి కదా ఏదైనా సమస్యకు పరిష్కారాలు ఆలోచించాల్సింది. తీవ్రమైన సామాజిక సమస్యగా మారిన వీధి కుక్కలకు ప్రాక్టికల్ పరిష్కారాలేమిటి? సంతాన నిరోధక ఆపరేషన్లా? బహిరంగస్థలాల నుంచి తొలగించి షెల్టర్లలో పెట్టటమా? లేక, వెనకటి రోజుల్లోలాగా ఏడాదికోసారో రెండుసార్లో మునిసిపల్ సిబ్బంది వీధి కుక్కలను సామూహికంగా నిర్మూలించటమా?.. దీనిపై విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. జనం ప్రాణాల్ని వీధి కుక్కల బారి నుంచి రక్షించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి.
