విజయవాడలో జరిగిన ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. తనతో పాటు ఓ పసిబిడ్డను ఓ మహిళ తీసుకుని వచ్చి పబ్లిక్ టాయిలెట్లో వదిలి వెళ్లడం అందరినీ కలిచివేస్తోంది.
విజయవాడ ఏప్రిల్ 11 (మహాప్రభ) : విజయవాడలో జరిగిన ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. తనతో పాటు ఓ పసిబిడ్డను ఓ మహిళ తీసుకుని వచ్చి పబ్లిక్ టాయిలెట్లో వదిలి వెళ్లడం అందరినీ కలిచివేస్తోంది. నగరంలోని కృష్ణలంక ప్రాంతంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. ముక్కుపచ్చలారని ఓ పసిబిడ్డను ఆ మహిళ పబ్లిక్ టాయిలెట్లో వదిలివేసి వెళ్లింది.
అసలేం జరిగిందంటే..?
కృష్ణలంక వద్ద ఉన్న పబ్లిక్ టాయిలెట్‌కు ఓ మహిళ బిడ్డతో సహా వెళ్లింది. బాత్రూమ్ లోపల పసిపాపను కింద పడుకోబెట్టి, ఎవరికీ కనిపించకుండా బకెట్‌ను అడ్డుగా పెట్టి ఆమె అక్కడి నుంచి పరారైంది. కాసేపటి తర్వాత టాయిలెట్‌ను శుభ్రం చేయడానికి వెళ్లిన శానిటరీ సిబ్బంది, పాప ఏడుపు విని గమనించగా ఈ విషయం బయటపడింది. సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పాపను మెరుగైన వైద్యం కోసం పాత ప్రభుత్వ ఆస్పత్రి (Old GGH)కి తరలించారు. ప్రస్తుతం పాప క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
పోలీసుల దర్యాప్తు..
కృష్ణలంక పోలీసులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ (CCTV) ఫుటేజీని పరిశీలించగా, సదరు మహిళను తీసుకువచ్చిన ఆటోను పోలీసులు గుర్తించారు. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆమె ఆటో ఎక్కడ ఎక్కింది, ఎక్కడ దిగిందనే వివరాలు తెలిశాయి. పాపను వదిలేసిన అనంతరం ఆ మహిళ నేరుగా రైల్వేస్టేషన్‌కు వెళ్లి, అక్కడ ఓ రైలు ఎక్కి పారిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి, ఆ మహిళ ఎవరు?, పాప ఆమె సొంత బిడ్డయేనా?, ఎందుకు వదిలి వెళ్లాల్సి వచ్చింది? అనే కోణంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098కి లేదా తమకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.
