ముంబై దాడుల మాస్టర్ మైండ్ తహవ్వుర్ రాణా కెనడా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ కస్టడీలో ఉన్న అతడికి ఈ సమాచారాన్ని అందించింది. కెనడా ప్రధాని కార్నీ త్వరలో భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ పరిణామానికి ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 24 మహాప్రభ : ముంబై దాడుల కుట్రదారు, పాక్ సంతతికి చెందిన తహవ్వుర్ రాణా (Tahawwur Rana) పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు కెనడా ప్రభుత్వం రంగంలోకి దిగింది (Canada Citizenship). త్వరలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ట్రూడో హయాంలో భారత్, కెనడా సంబంధాలు ఒడిదుడుకులకు లోనైన విషయం తెలిసిందే. పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో ప్రస్తుతం ప్రధాని కార్నీ భారత్ పర్యటనకు వస్తున్నారు.తహవ్వుర్ రాణా ప్రస్తుతం భారత్ కస్టడీలోనే ఉన్నాడు. ముంబై దాడులకు కుట్ర పన్నిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడిపై త్వరలో విచారణ మొదలు కానుంది. లష్కర్-ఏ-తయ్యబా ప్రోద్బలంతో 2008లో జరిగిన ఈ దాడుల్లో 160 మంది మరణించిన విషయం తెలిసిందే. ఇక, పౌరసత్వ రద్దుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించినట్టు కెనడా ప్రభుత్వం ఇటీవలే అతడికి సమాచారం ఇచ్చింది. పౌరసత్వం పొందే క్రమంలో అతడు తప్పుడు సమాచారం సమర్పించడంతో కెనడా ఈ చర్యలకు సమాయత్తం అయ్యింది.
తహవ్వుర్ రాణా 1997లో కెనడాకు వెళ్లాడు. 2001లో కెనడా పౌరసత్వం తీసుకున్నాడు. ఆ సమయంలో తన నివాసం గురించిన తప్పుడు సమాచారాన్ని అధికారులకు సమర్పించాడు. పౌరసత్వ దరఖాస్తుకు మునుపు తాను నాలుగేళ్లుగా ఒటోవా, టొరొంటోల్లో ఉన్నట్టు అతడు చెప్పుకున్నాడు. ఆ సమయంలో కేవలం 6 రోజుల పాటు మాత్రమే కెనడా బయట ఉన్నానని తెలిపాడు. ఈ వివరాలపై కెనడా పోలీసులు దర్యాప్తు జరిపారు. దరఖాస్తుకు మునుపు అతడు ఎక్కువగా చికాగోలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడ తహవ్వుర్ రాణాకు పలు స్థిరాస్తులు ఉన్నాయని, వ్యాపారాలు చేసేవాడని తెలుసుకున్నారు. దీంతో, అతడు తీవ్రమైన మోసానికి పాల్పడ్డట్టు కెనడా ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. అంతకాలం విదేశాల్లో ఉన్నా ఆ వివరాలను వెల్లడించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించి అతడిపై చర్యలకు ఉపక్రమించింది.
