యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది.
భువనగిరి జిల్లా, ఫిబ్రవరి 27 మహాప్రభ : ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిపై హత్యాయత్నం జరిగింది. తన చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై ఓ వ్యక్తి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం బాధితుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడుహైదరాబాద్(Hyderabad)లోని నేరెడ్‌మెట్ ప్రాంతానికి చెందిన అజయ్, రామలింగంపల్లికి చెందిన యువతి గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఇటీవల మూడు రోజుల క్రితం వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో అజయ్‌పై యువతి సోదరుడు పగ పెంచుకున్నాడు. బుధవారం యువతి మొబైల్ నుంచి రామలింగంపల్లికి రావాలంటూ అజయ్‌కి ఆమె సోదరుడు మెసేజ్ చేశాడు. తనను తన ప్రియురాలే పిలిచిందని భావించిన అజయ్ రామలింగంపల్లికి వెళ్లాడు. ఆ గ్రామ శివార్లలోకి రాగానే యువతి సోదరుడు అజయ్‌పై విచక్షణా రహితంగా దాడి చేశాడు.
యువతి సోదరుడు, అతని స్నేహితులు అజయ్ కళ్లలో కారం చల్లి… అనంతరం కత్తులతో దాడి చేశారు. అజయ్‌పై 14 సార్లు కత్తితో దాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో పడిపోవడంతో చనిపోయాడని భావించి అక్కడి నుండి వెళ్ళిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న అజయ్‌ని గాంధీకి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
