నాంపల్లి ఏరియాలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం మంటలు అదుపులోకి వచ్చాయని హైదరాబాద్ పోలీస్ సెంట్రల్ జోన్ డీసీపీ కె.శిల్పవల్లి తెలిపారు. ఈరోజు ఉదయం10:00 గంటలకు అగ్ని ప్రమాదంపై సమాచారం అందిందని వివరించారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 7 మహాప్రభ : హైదరాబాద్ నగరంలోని నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం (Nampally Fire Accident) జరిగింది. ల్యాబ్ భవనం మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కీలక పత్రాలు మంటల్లో కాలిపోయినట్లు సమాచారం. అయితే ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి.. హైదరాబాద్ పోలీస్ సెంట్రల్ జోన్ డీసీపీ కె.శిల్పవల్లి(DCP Shilpavalli) మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని ఆమె తెలిపారు
ఈ ల్యాబ్ నుంచే నేరపరిశోధన..
ఈరోజు ఉదయం 10:00 గంటలకు అగ్ని ప్రమాదంపై సమాచారం అందిందని డీసీపీ శిల్పవల్లి వివరించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చారు. నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్స్, ఎవిడెన్స్‌కు సంబంధించి ఈ ల్యాబ్ నుంచే ఆపరేషన్ జరుగుతుందని తెలిపారు. మంటల్లో కీలక ఫైల్స్ కాలిపోయిన విషయంపై ఇంకా స్పష్టత లేదన్నారు. మొదటి అంతస్తులో కంప్యూటర్స్ ఉంటాయని ఆమె వెల్లడించారు.
మంటలను పూర్తిగా అదుపు చేశాం.. : 5 ఫైర్ ఇంజిన్‌ల సాయంతో మంటలను పూర్తిగా అదుపు చేశామని డీసీపీ తెలిపారు. ఈ కార్యాలయంలో పనిచేస్తున్న ఆఫీస్ బాయ్ మంటలను గమనించి సమాచారం అందించారని వివరించారు. ఆఫీస్ బాయ్ గమనించి వెంటనే మంటలార్పే ప్రయత్నం చేశారని అన్నారు. ఈ క్రమంలో అతను అస్వస్థతకు లోనయ్యారని.. వెంటనే 108లో ఆస్పత్రికి తరలించామని డీసీపీ తెలిపారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు నలుగురు ఉద్యోగులు లోపలే ఉన్నారన్నారు. మంటలు గమనించి వారు సురక్షితంగా బయటపడ్డారని ఆమె చెప్పారు.
విలువైన హార్డ్ డిస్కులు అగ్నికి ఆహుతి: డీఎఫ్ఓ శ్రీ దాస్ : తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో మంటలు అదుపులోకి వచ్చాయని డీఎఫ్ఓ శ్రీ దాస్ తెలిపారు. మొదటి అంతస్తులోని వివిధ కేసులకు సంబంధించిన సీజ్డ్ ప్రాపర్టీ విభాగంలో అగ్నిప్రమాదం సంభవించిందన్నారు. చాలా విలువైన హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్స్ అగ్నికి ఆహుతయ్యాయని వివరించారు. ఇవాళ ఉదయం 10:22 గంటలకు అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిందని ఆయన అన్నారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నామని.. అప్పటికే మంటలు ఎగసి పడుతున్నాయని తెలిపారు. కెమికల్ ల్యాబ్ మెటీరియల్ మొత్తం రెండో అంతస్తులో ఉందని చెప్పుకొచ్చారు. అయితే రెండో అంతస్తుకు మంటలు వ్యాపించలేదన్నారు. మొదటి అంతస్తులో సెన్సిటివ్‌గా ఉన్న ప్లాస్టిక్ వస్తువుల కాలిపోయాయని వివరించారు.హార్డ్ డిస్కులు పూర్తిగా కాలిపోయాయా? పాక్షికంగా కాలాయా? అన్నది పరిశీలించాలని డీఎఫ్ఓ తెలిపారు.
