తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో.. అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. వివిధ పార్టీల నుంచి అభ్యర్థులు బరిలోకి దిగి.. తమ నామినేషన్లు దాఖలు చేసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు.
చెన్నై ఏప్రిల్ 2 (మహాప్రభ) : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో.. అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. వివిధ పార్టీల నుంచి అభ్యర్థులు బరిలోకి దిగి.. తమ నామినేషన్లు దాఖలు చేసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. టీవీకే పార్టీ చీఫ్ విజయ్ సైతం తన నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన.. పెరంబూర్, తిరుచురాపల్లి ఈస్ట్ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగారు.
ఈ రెండు స్థానాల్లో దాఖలు చేసిన అఫిడవిట్లో వివరాలు వేర్వేరుగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. పెరంబూర్ స్థానానికి సమర్పించిన అఫిడవిట్లో తనపై ఎలాంటి కేసులు లేవని విజయ్ స్పష్టం చేశారు. తిరుచురాపల్లి ఈస్ట్ స్థానానికి సమర్పించిన అఫిడవిట్లో తనపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు విజయ్ వివరించారని తెలిపారు. 2025లో పెరవల్లూరు పోలీస్ స్టేషన్లో విజయ్‌పై నమోదైన కేసును పెరంబూర్ ఫైలింగ్‌లో ఆయన వెల్లడించలేదు.అలాంటి వేళ.. ఈ వ్యత్యాసాలను స్పష్టం చేస్తూ సవరించిన అఫిడవిట్‌ను సమర్పించడం ద్వారా దిద్దుబాటు చర్యలకు ఒక్కటే మార్గమని ఈ సందర్భంగా విజయ్‌కు న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. విజయ్ తన అఫిడవిట్లో.. తన మొత్తం ఆస్తుల విలువ రూ.603.20 కోట్లు అని స్పష్టం చేశారు. వాటిలో రూ.213 కోట్లకుపైగా బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయని వివరించారు.
వాటితో పాటూ అత్యంత ఖరీదైన కార్లు సైతం తనకు ఉన్నాయని.. వాటి వివరాలను తన ఎన్నికల అఫిడవిట్లో టీవీకే చీఫ్ విజయ్ ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23వ తేదీన ఒకే విడతలో జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన వెలువడనున్నాయి.
