కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే దేవాదుల ప్రాజెక్టు బలైందని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆరోపించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో దేవాదుల పంప్‌హౌస్ పనులను పరిశీలించారు.
- బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు
హసన్‌పర్తి(హనుమకొండ) ఫిబ్రవరి 21 మహాప్రభ : కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే దేవాదుల ప్రాజెక్టు బలైందని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆరోపించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేట దేవాదుల పంప్‌హౌస్ పనులను మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేష్, చల్ల ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డితోపాటు పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.ఆంధ్రాలో సీఎం చంద్రబాబునాయుడికి శిష్యుడిగా సీఎం రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారని ఆరోపించారు. ఏపీకి నీళ్లు వదిలేందుకే దేవాదుల మోటార్లు బంద్ పెట్టారా.. అని ఎద్దేవా చేశారు.గోదావరిలో నీటి ప్రవాహం ఉన్నా ఎందుకు దేవాదుల లిఫ్ట్ వాడడం లేదని ప్రశ్నించారు. దేవాదుల ప్రాజెక్టు 90 శాతం పనులు పూర్తిచేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. రెండున్నరేళ్ల పాలనలో కాంగ్రెస్ రైతులను మోసం చేసిందన్నారు. సమ్మక్క బ్యారేజీ వద్ద 16వేల క్యూసెక్కులు వెళ్తున్నా దేవన్నపేట పంప్‌హౌస్‌లో మూడు మోటార్లు పనిచేయడం లేదని మండిపడ్డారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 2025 మార్చి 18న మంత్రులతో హడావిడిగా పంప్‌హౌస్ మోటార్లు ప్రారంభించి ఇప్పటి వరకు రైతులకు సాగునీరందించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. దేవన్నపేట పంప్‌హౌస్ మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల 60వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి లిఫ్టింగ్ ఆగిపోవడం వల్ల జనగామ, పాలకుర్తి,స్టేషన్‌ఘన్‌పూర్, గండిరామారం లిఫ్టింగ్ ఆగిపోయిందన్నారు.

