వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ 2025కు ముందు ఈ క్రికెటర్ పేరు అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు! కానీ ఐపీఎల్ తర్వాత తన సంచలన ఇన్నింగ్స్, మెరుపు సెంచరీలతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఐపీఎల్‌లో అడుగు పెట్టడంతోనే రికార్డు సృష్టించాడు.
ఇంకా పాల బుగ్గల పసితనమే పోలేదు..స్కూల్ బ్యాగ్ మోసే వయసులోనే..
క్రికెట్‌లో సంచనాలు సృష్టిస్తున్నాడు
బ్యాట్ పట్టాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే
పాలు తాగినంత సులువుగా సెంచరీలు బాదేస్తాడు..
అకస్మాత్తుగా క్రికెట్ అరంగేట్రం చేసి..
అద్భుతమైన అలలా ఎగిశాడు..
అతడే.. ‘టాక్ ఆఫ్ ది క్రికెట్’ వైభవ్ సూర్యవంశీ!
ఇంటర్నెట్ డెస్క్ మార్చి 27 (మహాప్రభ): వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ 2025కు ముందు ఈ క్రికెటర్ పేరు అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు! కానీ తర్వాత తన సంచలన ఇన్నింగ్స్, మెరుపు సెంచరీలతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఐపీఎల్‌లో అడుగు పెట్టడంతోనే రికార్డు సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన(14 ఏళ్ల 23 రోజులు) ఆటగాడిగా నిలిచాడు. అయితే భారత క్రికెట్‌కు ఓ ఆశగా ఎదుగుతున్న టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15వ పుట్టిన రోజు నేడు.ఐపీఎల్ ఆరంభం అవుతుంది అంటే.. అభిమానుల దృష్టి ఆటోమెటిగ్గా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ లాంటి సూపర్ స్టార్ల మీదికి మళ్లుతుంది. లీగ్‌కు ఆకర్షణ తెచ్చేది, స్టేడియాలకు అభిమానులను రప్పించేది ఇలాంటి ఆటగాళ్లే. కానీ ఈసారి మాత్రం ఇలాంటి లెజెండరీ క్రికెటర్లతో పాటు ఆసక్తి రేకెత్తిస్తోన్న యువ ఆటగాళ్లలో వైభవ్ సూర్యవంశీ ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పటికే తన సంచలన ప్రదర్శనలతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న వైభవ్.. ఈ సీజన్‌లో ఎలాంటి ప్రదర్శనలు చేస్తాడనే విషయంపై చర్చ నడుస్తోంది. అంచనాలకు తగ్గట్టు రాణిస్తే.. వైభవ్ ఓ స్టార్‌గా అవతరించే అవకాశముంది.
ఆ ఛాన్స్ దక్కుతుందా?
ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఏ క్రికెటర్ అయినా 15 ఏళ్లు నిండిన తర్వాతే అంతర్జాతీయ సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 15 ఏళ్లు నిండటంతో వైభవ్‌కు టీమిండియాలోకి మార్గం సుగమమైంది. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఈ కుర్రాడిపై ఏకంగా రూ.1.10కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇదేం విడ్డూరం అని అందరూ ఆశ్చర్యపోతున్న వేళ.. 14 ఏళ్ల వయసులో అతడితో ఐపీఎల్ మ్యాచ్ ఆడించి అభిమానులకు ఓ పెద్ద షాకిచ్చింది ఆర్ఆర్. వచ్చిన అవకాశాన్ని చక్కగా ఒడిసిపట్టుకుని గుజరాత్ టైటాన్స్‌పై వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్ల మోత మోగిస్తూ 35 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఆ సీజన్‌లో మొత్తంగా 7 మ్యాచుల్లో 252 పరుగులు చేసి తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు.అంతేనా అండర్ 19 జట్టులో తన మెరుపులు కొనసాగించాడు వైభవ్. ఆస్ట్రేలియా పర్యటనలో 58 బంతులోనే సెంచరీ, ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో 42 బంతుల్లోనే 144 పరుగులు చేసి విధ్వంసాలకు కేరాఫ్‌గా నిలిచాడు. అండర్ 19 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి టీమిండియా కుర్రాళ్లు ట్రోఫీని ఎత్తడంలో కీలక పాత్ర పోషించాడు. ఇలాంటి ఫామ్‌తో ఐపీఎల్‌లో అడుగుపెడుతుండటంతో వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సీజన్‌లోనూ రాణించాడంటే.. వచ్చే టీ20 ప్రపంచ కప్ లక్ష్యంగా భారత జట్టుకు వైభవ్‌ను తీసుకుంటారనడంలో సందేహం లేదు. మరి ఈ ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ మరోసారి సెన్సేషన్‌గా మారుతాడా? అనేది చూడాలి.
