మెట్రో రెండో దశ డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)పై ప్రతిష్టంభన నెలకొంది. తమ వద్దకు సరైన డీపీఆర్ ఇప్పటివరకు రాలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా.. తాము ఏడాది క్రితమే అన్ని అంశాలతో సమగ్రంగా పంపించామని, కేంద్రం అడుగుతున్న వివరాలను తెలియజేస్తున్నామని హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) వర్గాలు పేర్కొంటున్నాయి.
- సరైన డీపీఆర్ అందలేదంటున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
- 2024లోనే పంపించామంటున్న హెచ్ఏఎంఎల్ వర్గాలు
- సంయుక్త కమిటీ ఏర్పాటు కాలేదని కేంద్రం మరో వాదన
- తొలిదశ టేకోవర్‌ను పూర్తి చేస్తేనే నిధులిస్తామని సూచన
- రెండు ప్రభుత్వాల మధ్య నెలల తరబడి డీపీఆర్ పంచాయితీ
- హైదరాబాద్ సిటీ ఫిబ్రవరి 12 మహాప్రభ: మెట్రో రెండో దశ డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)పై ప్రతిష్టంభన నెలకొంది. తమ వద్దకు సరైన డీపీఆర్ ఇప్పటివరకు రాలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా.. తాము ఏడాది క్రితమే అన్ని అంశాలతో సమగ్రంగా పంపించామని, కేంద్రం అడుగుతున్న వివరాలను తెలియజేస్తున్నామని హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఎవరు చెప్పేది నిజమో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పంచాయితీ ఇరు ప్రభుత్వాల నడుమ నెలల తరబడి కొనసాగుతుండడంతో నగరవాసులు నిరాశకు లోనవుతున్నారు.మెట్రో నిర్మాణం కోసం కేంద్రం తరపున ఇచ్చే వాటా నిధులు తమ పట్టణాభివృద్ధి శాఖ వద్ద తగినన్ని ఉన్నాయని, హైదరాబాద్ మెట్రోపై రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఓ స్పష్టత తెచ్చుకోవాలని, ఎల్అండ్టీ నుంచి మొదటి దశ టేకోవర్ ప్రక్రియను త్వరగా పూర్తిచేసి, లావాదేవీల నివేదికను సమగ్రంగా అందిస్తే మంత్రివర్గ ఆమోదంతో డీపీఆర్‌కు అనుమతి ఇస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో విలేకరుల సమావేశంలో వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. ఎల్అండ్టీ నుంచి మొదటి దశ ప్రాజెక్టును టేకోవర్ చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంయుక్త కమిటీ ఏర్పాటు కాలేదని, ఇద్దరు అధికారుల పేర్లను పంపాలని కోరినా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ప్రతిపాదించలేదని కిషన్‌రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.

అనుమతికి అడ్డంకిగా మొదటి దశ టేకోవర్!
నష్టాల భారంతో మెట్రో నిర్వహణ నుంచి తప్పుకుంటామని ఎల్అండ్టీ సంస్థ చెప్పడంతో మొదటి దశ ప్రాజెక్టు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటున్న విషయం తెలిసిందే. రవాణా ఆధారిత అభివృద్ధి (టీఓడీ) కింద ఎల్అండ్టీకి ఇచ్చిన భూములు, లావాదేవీలపై వడివడిగా ఆడిటింగ్ జరుగుతోంది. ఈ ప్రక్రియను మార్చిలోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో హెచ్ఏఎంఎల్ అధికారులు ముందుకుసాగుతున్నారు. అయితే ఎల్అండ్టీ నుంచి స్వాధీన ప్రక్రియ ముగిసేలోపు రెండో దశ డీపీఆర్‌కు అనుమతి ఇచ్చి నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుండగా.. కేంద్రం అందుకు ససేమిరా అంటోంది.నిర్మాణానికి అనుకూలంగా ఉన్న కారిడార్లకైనా త్వరగా అనుమతి ఇస్తే పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రతిపాదించిన పనులకు ఎలాంటి కొర్రీలు లేకుండా అనుమతి ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని ప్రాజెక్టులకు కావాలని మోకాలడ్డుతోందని,14 నెలలుగా సాగదీసే ధోరణితో వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పెద్దలు వాపోతున్నారు. తాజా బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని భావించినప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు.
