దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో ఇకపై గృహ వినియోగదారుల కోసం ఒక సిలిండర్‌లో 10 కేజీల గ్యాస్‌ను సరఫరా చేసే అంశాన్ని ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు పరిశీలిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్ మార్చి 23 మహాప్రభ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ గ్యాస్ కొరత నెలకొంది. ఈ పరిస్థితుల్లో గృహ వినియోగదారులకు సరఫరాలో అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు దృష్టి సారించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇకపై గృహ వినియోగదారులకు 10 కేజీల ఎల్‌పీజీ గ్యాస్‌తో సిలిండర్‌లను సరఫరా చేసే అంశాన్ని ఆయిల్ సంస్థలు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. తద్వారా సరఫరాలో ఆటంకాలు రాకుండా ప్రస్తుత నిల్వలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని సంస్థలు భావిస్తున్నాయి.ప్రస్తుతం 14.2 కేజీల సిలిండర్‌లు సరఫరా అవుతున్న విషయం తెలిసిందే. ఇకపై ఈ సిలిండర్‌లలో 10 కేజీల గ్యాస్ నింపి సరఫరా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందు కోసం ప్రభుత్వ అనుమతుల అవసరం. గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్‌ల వ్యవస్థల్లో కూడా ఈ మేరకు మార్పులు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. వచ్చే నెలలో గ్యాస్ కొరత మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ప్రభుత్వ రంగ సంస్థలు భావిస్తున్నట్టు సమాచారం. అయితే, ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది. ఇక గత వారం ఎల్‌పీజీ గ్యాస్‌తో రెండు నౌకలు గల్ఫ్ నుంచి భారత్‌కు చేరుకున్నాయి. వీటిల్లో మొత్తం 92,700 టన్నుల ఎల్‌పీజీ సరఫరా అయ్యింది. ప్రస్తుత పరిస్థితుల్లో పొదుపు చర్యలు అవసరమని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రెటరీ సుజాత శర్మ ఇటీవల మీడియా సమావేశంలో అభిప్రాయపడిన విషయం తెలిసిందే.
