Tuesday, February 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
Homeఎడిటోరియల్ఆదివాసీల అస్తిత్వ పతాక ‘మేడారం’ - Festival Sammakka Saralamma

ఆదివాసీల అస్తిత్వ పతాక ‘మేడారం’ – Festival Sammakka Saralamma

📰 Generate e-Paper Clip

మారుమూలన ఉన్న ఓ వనారణ్యం రెండేళ్లకోసారి జనారణ్యమై భాసిల్లడానికి జాతరలోని విభిన్నతే కారణం. స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో ఈ జాతర నాలుగు రోజుల పాటు సాగుతుంది. ఆదివాసీల అరుదైన పూజా విధానాలతో, తీరొక్క మొక్కులతో అబ్బురపరుస్తుంది.

మహాప్రభ – వెబ్ డెస్క్ : మేడారం జాతరను ఎన్నిసార్లు చూసినా, అక్కడి ఆదివాసీ సంప్రదాయాలతో ఎన్నిసార్లు సహానుభూతి చెందినా తనివి తీరదు. ప్రతీసారి ఏదో ఒక విభిన్నత అనుభవంలోకి వచ్చి భావోద్వేగాన్ని కలిగిస్తుంది. తెలంగాణ నేల స్వభావానికి, సాంస్కృతిక వైభవ పరంపరకు మేడారం నిలువెత్తు ప్రతీక. మూలవాసుల అస్తిత్వానికి పతాక చిహ్నమై, ప్రకృతితో పెనవేసుకున్న వారి ఆచార వ్యవహారాలకు సంకేతమై శరీరాన్ని రోమాంచితం చేస్తుంది. మేడారం జాతర రెండేళ్లకోసారి జరిగే పండుగ మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం. ప్రకృతిలోకి ప్రయాణం చేసి పొందే తాదాత్మ్యత. అక్కడేదో మహత్తు ఉంది.మేడారంలో కొలువైన సమ్మక్క, సారలమ్మలకు సంబంధించి జనశ్రుతుల్లో అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. వాళ్లు కోయ పాలకులని, కాకతీయులకు సామంతులని, కప్పం కట్టలేక ప్రజల కోసం వారిని ఎదిరించి యుద్ధంలో ప్రాణాలను త్యజించిన వీరులనీ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు వాళ్లు పుట్టు దేవతలని, చల్లని తల్లులని, కోరిన కోర్కెలు తీర్చే దైవాలని ఆదివాసీలు కథలు కథలుగా చెప్పుకుంటారు, తమ ఇలువేల్పులుగా కొలుస్తారు. ఇప్పటికే ప్రాచుర్యంలో ఉన్న కథనాలకు తోడుగా, కాలక్రమంలో అనేక కొత్త కథనాలూ వ్యాఖ్యానాలూ పుట్టుకువస్తున్నాయి.ఎన్ని ప్రచారాలు, కథనాలు ఉన్నా సమ్మక్క సారలమ్మలు… భక్తకోటి గుండెల్లో దైవాలుగా వెలుగొందుతున్నారు. కోరిన కోర్కెల్ని తీర్చే మహిమాన్విత శక్తులుగా, వీరత్వానికి ప్రతీకలుగా విరాజిల్లుతున్నారు. పోరాటాలకు, ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తున్నారు. మేడారం మొన్నటివరకు కనీసం గ్రామ పంచాయతీ కూడా కాదు. ఊరట్టం అనే పంచాయతీలో ఆవాస గ్రామం. పట్టుమని వెయ్యి మంది జనాభా కూడా లేని ఓ మారుమూల పల్లె. కానీ అక్కడ కొలువైన వనదేవతల మూలంగా ఆ పల్లె రెండేళ్లకోసారి కోటి మందిని తన దగ్గరకు రప్పించుకుంటుంది.మారుమూలన ఉన్న ఓ వనారణ్యం.. రెండేళ్లకోసారి జనారణ్యమై భాసిల్లడానికి జాతరలోని విభిన్నతే కారణం. స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో ఈ జాతర నాలుగు రోజుల పాటు సాగుతుంది. ఆదివాసీల అరుదైన పూజా విధానాలతో, తీరొక్క మొక్కులతో అబ్బురపరుస్తుంది. గుడి ఉండదు.. గోపురాలు ఉండవు, ధ్వజస్తంభం ఉండదు.. ద్వారపాలకులు ఉండరు, అర్చకులు ఉండరు.. ఆర్జిత సేవలూ ఉండవు. నాలుగు వృత్తాకార గద్దెలపై, నడుమ పాతిన కర్రలే దైవాలకు ప్రతిరూపంగా కనిపిస్తాయి. జాతర వేళ కుంకుమ భరిణెలను ప్రతిష్ఠించినా అవి బయటకు కనిపించవు. మేడారంలో సమ్మక్క, సారలమ్మలు భౌతిక రూపాల్లో దర్శనమివ్వరు. వారు పూర్తి అమూర్తంగా ఉంటారు. జంపన్నవాగులో పుణ్యస్నానం చేసి, గద్దెల వద్దకు వచ్చి ‘సల్లంగ సూడు సమ్మక్క తల్లీ..’ అని రెండు చేతులెత్తి ప్రార్థించడంతో మొక్కు పూర్తవుతుంది. అక్కడ నిర్వచించలేని ఓ నమ్మకం, విశ్వాసం నిటారుగా నిలబడిన దాఖలా కనిపిస్తుంది. అదొక రహస్య జగత్తు.

జాతర ఆద్యంతం అలుముకునే ఉద్విగ్నత ప్రతీ ఒక్కరిని సమ్మోహనుల్ని చేస్తుంది. నిండు పౌర్ణమి వేళ సమ్మక్క, సారలమ్మ రాక, గద్దెలపై కొలువుదీరే ఘట్టాలు మేడారం అటవీప్రాంతాన్ని భక్తిపారవశ్యపు శిఖరాగ్రాన నిలబెడతాయి. తొలిరోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను, రెండోరోజు చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకువచ్చే ఘట్టాలను ప్రత్యక్షంగా చూడటం జీవితకాల జ్ఞాపకం. ఈ రెండు ఘట్టాలు సాయంత్రం 5 గంటలకు మొదలై రాత్రి 8 గంటల కల్లా పూర్తవుతాయి. ఆ వ్యవధిలో మేడారం భక్తజన సంద్రమై ఉప్పొంగుతుంది. లక్షలాది కోళ్లూ, యాటలూ తలలు తెంచుకొని తల్లులకు రక్తాభిషేకం చేస్తాయి. శివసత్తులు శిగాలూగుతూ అపర వనదేవతలై వీరంగమాడుతారు. తల్లులను తరలించే ఆదివాసీ వడ్డెలను (పూజారులు) తాకడం కోసం దారిపొడవునా జనం పోటెత్తుతారు. తల్లులు గద్దెలపైకి చేరడంతోనే మేడారం… నిండు పున్నమి వెలుగులో దైవక్షేత్రంగా రూపుదాల్చి జేగీయమానమవుతుంది. మొక్కులు ఊపందుకుంటాయి. తల్లుల చెంతకు భక్తులు వెల్లువెత్తుతారు. ఆ సమయంలో గద్దెల ప్రాంగణమే కాదు, మేడారం యావత్తూ అద్భుతమైన కాంతితో ప్రకాశిస్తూ సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుంది.

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!