ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంఅలసందతో ఆదాయం

అలసందతో ఆదాయం

📰 Generate e-Paper Clip

జిల్లాలోనే ప్రత్యేకించి తనకల్లు మండలంలో ఏడాది పొడవునా వందలాది ఎకరాల్లో టమోటా సాగులో ఉంటుంది. ఇటీవల టమోటా సాగుకు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

  • లాభదాయకంగా విత్తన పంట సాగు
  • టమోటాకు రెండో పంటగా పెడుతున్న రైతులు
  • పురుగు మందుల అవసరం తక్కువే
  • మేలైన దిగుబడులతో అన్నదాతకు లాభాలు

తనకల్లు(అనంతపురం),ఫిబ్రవరి 25 మహాప్రభ : జిల్లాలోనే ప్రత్యేకించి తనకల్లు మండలంలో ఏడాది పొడవునా వందలాది ఎకరాల్లో టమోటా సాగులో ఉంటుంది. ఇటీవల టమోటా సాగుకు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పేపర్‌ (మల్చింగ్‌షీట్‌), డ్రిప్‌, కట్టెలు, వైరు, మందులు, ఎరువులు, కూలీలు ఇలా ఎకరాలో పంట సాగు చేయడానికి రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చవుతోంది. ఇంత ఖర్చు పెట్టి సాగుచేస్తే.. మార్కెట్‌లో ధరలు ఉంటాయో.. లేదో.. తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ కారణంగా టమోటా సాగుచేసిన రైతులు రూ.లక్షలు నష్టపోవాల్సి వస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటక(Karnataka) రాష్ట్రంలోని బాగేపల్లి, చేలూరు, చింతామణి ప్రాంతాలకు చెందిన సీడ్‌ వ్యాపారులు తమ దృష్టిని తనకల్లు మండలం వైపు మళ్లించారు. దీంతో మండల రైతులు ఏడాది పొడవునా టమోటాలు సాగుచేసి, నష్టాల పాలవుతుండడంతో కొంత విత్తన అలసంద సాగువైపు మొగ్గుచూపారు. టమోటాకు రెండో పంటగా పెట్టే ఈ విత్తన అలసంద సాగు ఆశాజనకంగా ఉండడంతో మండలంలోని వివిధ గ్రామాల్లో ఈ ఏడాది వందలాది ఎకరాల్లో సాగుచేశారు. యర్రబల్లి పరిధిలోనే వందకుపైగా ఎకరాల్లో పంట పెట్టారు. క్వింటాల్‌ ధర రూ.18వేలతో రైతులతో ఒప్పందం చేసుకుని, విత్తనాలను వ్యాపారులు ఉచితంగా అందజేశారు.ఎకరాలో 6 నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఎకరాలో పంట సాగుకు రూ.5వేలకు మించి పెట్టుబడి అవసరంలేదని వారు అంటున్నారు. నిరకంగా రూ.60వేల నుంచి రూ.80 వేల వరకు ఆదాయం వస్తోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండల వ్యాప్తంగా విత్తన అలసంద సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం కోత దశలో ఉంది. కొంతమంది రైతులు పంట నూర్పిడి చేసి విక్రయిస్తున్నారు. లాభసాటిగా ఉండడంతో పలువురు రైతులు ఆవైపు మొగ్గు చూపుతున్నారు. రసాయన మందులు కూడా పెద్దగా అవసరం లేదని రైతులు చెబుతున్నారు. బంక, పేను నివారణకు మాత్రమే రెండు, మూడుమార్లు మందులు పిచికారీ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.

మూడున్నర ఎకరాల్లో సాగుచేశా

మూడున్నర ఎకరాల్లో విత్తన అలసంద సాగుచేశా. పంటను కోసి, నూర్పిడి చేయడానికి సిద్ధంగా ఉంచా. గ్రామంలో వంద ఎకరాలకుపైగా విత్తన అలసంద సాగుచేశాం. దిగుబడి బాగా ఉంది. నిరకంగా ఎకరానికి రూ.60 వేల నుంచి రూ.80వేలదాకా ఆదాయం వస్తుంది.

– బ్రహ్మానందరెడ్డి, రైతు, యర్రబల్లి

వందలాది ఎకరాల్లో సాగు

టమోటాలు ఏడాది పొడవునా సాగుచేసి నష్టపోయా. అందులోనే రెండో పంటగా అలసంద పెట్టా. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యాపారులు విత్తనాలను ఉచితంగా ఇస్తున్నారు. ఎకరానికి 5నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. క్వింటా ధర రూ.18వేలుగా ముందుగానే నిర్ణయించుకున్నాం. దీంతో లాభాలు వస్తున్నాయి. దీంతో పంట సాగుకు రైతులు ముందుకొస్తున్నారు.

– రవి, రైతు, యర్రగుంట్లపల్లి

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!