ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో చొక్కాలు విప్పి నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 మహాప్రభ : ఢిల్లీలోని భారత్ మండపంలో ఇటీవల జరిగిన AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సందర్భంగా యూత్ కాంగ్రెస్ (IYC) కార్యకర్తలు చేసిన ‘షర్ట్‌లెస్’ నిరసనకు సంబంధించి యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నిరసన గురువారం (ఫిబ్రవరి 20) సమ్మిట్ ఎగ్జిబిషన్ హాల్‌లో జరిగిన సంగతి తెలిసిందే.ఐదుగురు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు షర్టులు విప్పేసి, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా సందేశాలు రాసిన టీ-షర్టులు పట్టుకొని నిరసన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఆరోపణలు గుప్పించారు. సెక్యూరిటీ సిబ్బంది వారిని వెంటనే బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటన తర్వాత ఏడుగురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
ఉదయ్ భాను అరెస్ట్
ఇవాళ మంగళవారం (ఫిబ్రవరి 24) ఢిల్లీ పోలీసులు ఉదయ్ భాను ను అరెస్టు చేశారు. ఆయనను తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో 15 గంటలకు పైగా విచారించిన తర్వాత అరెస్టు చేశారని సమాచారం. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్ట్‌ల సంఖ్య ఎనిమిదికి చేరింది. పోలీసులు ఆయనపై.. కుట్రలో పాత్ర ఉందని, విచారణలో సహకరించలేదని, తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నారు. త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
కాంగ్రెస్ స్పందన
భూపేష్ బాఘేల్ వంటి సీనియర్ నేతలు ఈ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. ‘ప్రజాస్వామ్యంలో యువత ప్రశ్నలు వేయడం, నిరసన తెలపడం నేరం కాదు – అది ప్రజాస్వామ్య ఆయుధం’ అని బాఘేల్ అన్నారు. ఈ అరెస్ట్‌లను ‘అరాచక’, ‘అన్యాయ’ చర్యలుగా పేర్కొన్నారు. నిరసన.. శాంతియుతంగా జరిగిందని, యువత బాధలను బయటపెట్టడమే ఉద్దేశ్యమని కాంగ్రెస్ వర్గాలు వాదిస్తున్నాయి.
BJP స్పందన
BJP నేత ప్రదీప్ భండారి ఈ నిరసనను ‘నేక్డ్ యాంటీ-ఇండియా ప్రొటెస్ట్’ అని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను యాంటీ-ఇండియా, యాంటీ-గ్రోత్ పార్టీగా విమర్శించారు. ‘యువతకు కాంగ్రెస్ ‘నంగి’ పార్టీగా కనిపిస్తోంది’ అని Xలో పోస్ట్ చేశారు.
నేపథ్యం
ఈ AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో జరుగుతున్న చర్చలు, ప్రదర్శనలకు సంబంధించింది. దీనిని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈవెంట్‌గా చూస్తున్నారు. అయితే, ఈ నిరసన వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందని, దేశం పరువు మంటగలపాలన్నది వీరి పన్నాగమని బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి.