mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 20 February 2026, 12:05 pm Digital Edition : Namastey Mahaaprabha

30 ఏళ్లు దాటినా.. మెరిసే చర్మం కావాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

30 ఏళ్ల తర్వాత చర్మంలో ముడతలు, మెరుపు తగ్గడం వంటి మార్పులు కనిపిస్తుంటాయి. అయితే సరైన చర్మ సంరక్షణ, ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిలో మార్పులతో యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉన్న చర్మాన్ని ఎక్కువకాలం కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు..

ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 20 మహాప్రభ : 30 ఏళ్లు దాటిన తర్వాత చర్మంలో మార్పులు రావడం సహజం. చర్మంలో కొల్లాజెన్ తగ్గడం వల్ల ముడతలు, సన్నని గీతలు కనిపించడం ప్రారంభమవుతుంటాయి. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా 40, 50 ఏళ్లలో కూడా చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉంచుకోవచ్చు. చర్మ సంరక్షణ అంటే కేవలం అందం కోసం కాదు, ఆరోగ్యకరమైన చర్మం కోసం కూడా అవసరం. కొన్ని సరళమైన అలవాట్లు పాటిస్తే చర్మం మళ్లీ మెరుపును పొందుతుంది.

సూర్యరశ్మి నుండి రక్షణ..

చర్మంలో వృద్ధాప్య లక్షణాలు కనిపించడానికి సూర్యకిరణాలు ప్రధాన కారణం. అందుకే రోజూ SPF 50, PA++++ ఉన్న సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలి. బయటకు వెళ్లకపోయినా.. ఇంట్లో ఉన్నప్పటికీ సన్‌స్క్రీన్ వాడటం మంచిది. మొబైల్, కంప్యూటర్ స్క్రీన్‌ల నుండి వచ్చే నీలి కాంతి కూడా చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్‌స్క్రీన్ మళ్లీ అప్లై చేస్తుండాలి. బయటకు వెళ్లేటప్పుడు టోపీ లేదా గొడుగు వాడటం మంచిది.

రెటినాయిడ్స్ వాడకం..

రెటినాయిడ్స్ విటమిన్ A నుండి తయారవుతాయి. ఇవి కొత్త చర్మ కణాల ఉత్పత్తిని పెంచి, ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. మొదట తక్కువ శాతం (0.2%–0.5%)తో ప్రారంభించి, రాత్రి సమయంలో మాత్రమే వాడాలి. వాడిన తర్వాత మరుసటి రోజు సన్‌స్క్రీన్ తప్పనిసరిగా అప్లై చేయాలి.

కాలుష్యం, ఒత్తిడి నుంచి రక్షణ..

వాయు కాలుష్యం, ఒత్తిడి వల్ల చర్మం దెబ్బతింటుంది. ఉదయం విటమిన్ C సీరమ్ వాడటం వల్ల చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. నియాసినమైడ్ వాడటం వల్ల చర్మపు రంగు సమంగా మారుతుంది. అలాగే పొడిబారడం కూడా తగ్గుతుంది.

జీవనశైలిలో మార్పులు..

చర్మ ఆరోగ్యం కోసం మంచి ఆహారం కూడా అవసరం. వాల్‌నట్స్, నువ్వులు, ఆకుకూరలు, పండ్లు వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. చక్కెర, మద్యం తగ్గించాలి. సరిపడా నిద్ర, క్రమమైన వ్యాయామం.. చర్మాన్ని సహజంగా మెరుస్తూ ఉండేలా చేస్తాయి. సరైన సంరక్షణ, ఆరోగ్యకరమైన అలవాట్లు పాటిస్తే 30 ఏళ్ల తర్వాత కూడా యవ్వన చర్మాన్ని కాపాడుకోవచ్చు.