mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 9:21 am Digital Edition : MAHAA PRABHA DAILY

30 ఏళ్లు దాటాయా? ఒంట్లో ఈ మార్పులు కనిపిస్తే..

30 ఏళ్లు దాటాక కండరాలు, ఎముకలు బలహీనపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో కొన్ని మార్పులు కనిపిస్తాయని అంటున్నారు. వీటిని గుర్తించగానే నివారణ చర్యలు ప్రారంభించాలని చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం పదండి.

ఇంటర్నెట్ డెస్క్ మార్చి 23 మహాప్రభ : 30 ఏళ్లు దాటిన తర్వాత కండరాలు, ఎముకల ఆరోగ్యం క్రమంగా క్షీణించడం ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో శరీరంలో కొన్ని మార్పులు కూడా కనిపిస్తుంటాయి. వీటిని త్వరగా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి 30 ఏళ్లు దాటిన వారు తమ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయాలు ఏంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.వయసు పెరిగే కొద్దీ కండరాల క్షీణత ప్రారంభం అవుతుంది. చేతుల్లో బలం తగ్గినట్టు అనిపించడం ప్రారంభం అవుతుంది. కండరాలు, ఎముకలు బలహీనపడటం ప్రారంభమైనప్పుడు త్వరగా అలసట ముంచుకొస్తుంది. మెట్లు ఎక్కడం వంటి చిన్నపాటి పనులకే నీరసం ఆవరిస్తుంది. నడిచేటప్పుడు ముందుకు వంగిపోతున్నట్టు అనిపిస్తుంటే ఎముకల బలం తగ్గినట్టు భావించాలి. కండరాలు, ఎముకలు బలహీనపడ్డప్పుడు కొందరిలో పంటి చిగుళ్లు వెనక్కి వెళ్లడం గోళ్లు పెళుసుగా మారడం వంటివి కూడా కనిపిస్తుంటాయి.

ఇలాంటి సమస్యలు మొదలవగానే కొన్ని జీవనశైలి మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముందుగా కసరత్తులను జీవనశైలిలో భాగం చేసుకోవాలి. వారానికి కనీసం 2-3 సార్లు బరువులు ఎత్తే వ్యాయామాలు చేస్తే జీవక్రియలు మెరుగుపడతాయి. కండరాలు దృఢంగా మారతాయి.

కండరాల పటుత్వం పెరిగేందుకు ప్రోటీన్లు, ఎముకలు బలంగా మారేందుకు కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

రోజంతా ఒకే చోట కూర్చోకుండా అప్పుడప్పుడూ నడవడం, మెట్లు ఎక్కిదిగడం వంటివి చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. 30ల్లోకి ప్రవేశించిన వారు ఈ టిప్స్‌ను తూచా తప్పకుండా పాటిస్తే ఆరోగ్యాన్ని కలకాలం కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.