mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 12:08 pm Digital Edition : Namastey Mahaaprabha

హైదరాబాద్‌లో విషాదం.. ఇన్‌స్టాగ్రామ్‌లో వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య

హైదరాబాద్ శివారు హయత్ నగర్ పరిధిలోని కుంట్లూరులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమాలు, తోటి విద్యార్థుల వేధింపులు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి.

హైదరాబాద్ ఏప్రిల్ 10 (మహాప్రభ) : హైదరాబాద్ శివారు హయత్ నగర్ పరిధిలోని కుంట్లూరులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమాలు, తోటి విద్యార్థుల వేధింపులు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. పదోతరగతి చదువుతున్న ఓ బాలిక, తోటి విద్యార్థి వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడింది. కుంట్లూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్య స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.తోటి విద్యార్థి వేధింపులే ఈ ఘాతుకానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

లైంగిక వేధింపులు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు, నిందితుడైన బాలుడు ఒకే పాఠశాలలో పదోతరగతి చదువుతున్నారు. మొదట స్నేహం పేరుతో పరిచయమైన సదరు విద్యార్థి, ఆ తర్వాత తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆ బాలికను నిందితుడు లైంగికంగా వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. విద్యార్థి ప్రవర్తనపై బాలిక, ఆమె కుటుంబ సభ్యులు గతంలోనే పలుమార్లు మందలించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ నిందితుడి ప్రవర్తనలో మార్పు రాకపోగా, వేధింపులు మరింత ఎక్కువయ్యాయి.

బలవన్మరణం – కుటుంబ సభ్యుల ఆవేదన..

నిన్న (గురువారం) ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, మనస్తాపానికి గురైన ఆ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు విగతజీవిగా పడి ఉన్న కూతురుని చూసి కన్నీరుమున్నీరయ్యారు. తీవ్ర ఆవేదనలో ఉన్న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే, మృతదేహాన్ని తీసుకొని తమ సొంత గ్రామానికి (సాగర్ సమీప ప్రాంతం) వెళ్లిపోయారు.

పోలీసుల జోక్యం – కేసు నమోదు..

ఈ ఘటనపై సమాచారం అందుకున్న హయత్ నగర్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకెళ్తున్న క్రమంలో పోలీసులు మార్గమధ్యంలో (సాగర్ రోడ్డు) వారిని ఆపి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరిగి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడైన బాలుడిపై వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు గానూ కేసు నమోదు చేశారు. బాలిక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్ వివరాలను విశ్లేషిస్తున్నారు.

తల్లిదండ్రులకు సూచన..

సామాజిక మాధ్యమాల వినియోగం విషయంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనిస్తూ, వారికి భరోసా కల్పించడం ద్వారా ఇలాంటి అవాంఛనీయ ఘటనలను నిరోధించవచ్చని పోలీసులు తెలిపారు.