mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 05 February 2026, 9:10 am Digital Edition : Namastey Mahaaprabha

హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. ఉమెన్స్ హాస్టల్లో చెలరేగిన మంటలు : Mahaaprabha

ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్‌లో గల ఓ ఉమెన్స్ హాస్టల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

హైదరాబాద్, ఫిబ్రవరి5 మహాప్రభ : ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్‌లో గల ఓ ఉమెన్స్ హాస్టల్లో గురువారం అగ్ని ప్రమాదం(Hyderabad Fire incident) జరిగింది. ఈ ఘటనపై స్థానికులు అగ్నిమాపక అధికారులు, పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అదృష్టవశాత్తూ ప్రమాద సమయంలో ఆ వసతి గృహంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది

షార్ట్ సర్క్యూట్ వల్ల.?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్‌లోని సుధామ పీజీ(PG) అకామడేషన్ ఫర్ ఉమెన్స్ హాస్టల్లో అగ్నిప్రమాదం జరిగింది. హాస్టల్‌లో ఉన్న యువతులంతా.. విధులు, కాలేజీలకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒకవేళ రాత్రి సమయంలో లేదా విద్యార్థులున్న సమయంలో ఈ ఘటన జరిగి ఉంటే పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ అగ్నిప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించి ఉండవచ్చని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.

రంగంలోకి అగ్నిమాపక, హైడ్రా సిబ్బంది..

మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న మూడు ఫైర్ ఇంజిన్లు.. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బందితో పాటు హైడ్రా(HYDRAA) బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొని మంటలు పక్క భవనాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. నగరంలోని పీజీ హాస్టళ్లలో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండటానికి పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచనలు చేశారు. పాత పీజీ హాస్టళ్లలో ఎలక్ట్రికల్ వైరింగ్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయించాలని అన్నారు. ప్రతి అంతస్తులో ఫైర్ సేఫ్టీ పరికరాలు అందుబాటులో ఉంచాలని కోరారు. షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఎలా స్పందించాలో హాస్టల్ విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి నష్టం ఎంత జరిగిందనే దానిపై అధికారులు అంచనా వేస్తున్నారు.