mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 6:54 am Digital Edition : MAHAA PRABHA DAILY

హైదరాబాద్‌లో ఇంధన కొరత లేదు: ఆందోళన చెందవద్దు: సీపీ సజ్జనార్

హైదరాబాద్‌లో ఇంధనం, ఎల్పీజీ కొరత లేదని సీపీ సజ్జనార్ చెప్పారు. సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని.. నగర వ్యాప్తంగా సరఫరా సజావుగా కొనసాగుతోందని వెల్లడించారు. పౌరులు ఆందోళన చెందవద్దని, రూమర్స్ నమ్మొద్దని, వ్యాప్తి చేయొద్దని కోరారు.

మార్చి 24 మహాప్రభ :  హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ (LPG) కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పందించారు. నగరంలో ఇంధన నిల్వలు నిండుకున్నాయనేది కేవలం అపోహ మాత్రమేనని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.నగరవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీల దగ్గర సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా ఎక్కడా ఆగిపోలేదని సీపీ తెలిపారు. కొరత ఉందన్న ఆందోళనతో పెట్రోల్ బంక్‌ల వద్ద భారీగా క్యూ కట్టవద్దని, అనవసరంగా ఇంధనాన్ని నిల్వ చేసుకోవడానికి ప్రయత్నించవద్దని ఆయన పౌరులకు విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ సిటీ పోలీస్ యంత్రాంగం ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని, రవాణా సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను వదంతులను నమ్మవద్దని, వాటిని ఇతరులకు షేర్ చేయవద్దని సీపీ హెచ్చరించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని సూచించారు.నగరంలో సాధారణ పరిస్థితులు కొనసాగేందుకు ప్రజలందరూ సహకరించాలని సీపీ కోరారు. రద్దీ వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బంక్‌ల వద్ద బారులు తీరవద్దని సూచించారు.