mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 31 March 2026, 6:46 am Digital Edition : MAHAA PRABHA DAILY

హైదరాబాద్‌లోని జయలలిత నివాసం సీజ్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన హైదరాబాద్‌లోని ఆమె ఇంటిని అధికారులు సీజ్ చేశారు.

హైదరాబాద్, మార్చి 31 (మహాప్రభ) : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రికి చెందిన ఇల్లు సీజ్ అయింది. హైదరాబాద్‌లో ఉన్న ఆమె ఇంటిని జీహెచ్‌ఎంసీ అధికారులు సోమవారం సీజ్‌ చేశారు. శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆమె ఇంటికి సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు ఫిబ్రవరిలోనే ఆస్తిపన్ను బకాయిలపై నోటీసులు జారీ చేశారు. అయితే జయలలితకు సంబంధించివారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ క్రమంలో శ్రీనగర్ కాలనీలో ఉన్న జీ+4 భవనాన్ని సీజ్‌ చేశారు. ఈ ఇంటికి సంబంధించి 2017 నుంచి సుమారు రూ.83 లక్షల ఆస్తి పన్ను బకాయిలు ఉన్నాయని సమాచారం.

నిన్న(సోమవారం) జీహెచ్‌ఎంసీ ఏఎంసీ బాల్‌రాజ్‌ ఆధ్వర్యంలో సిబ్బంది జయలలిత ఇంటిని సీజ్‌ చేశారు. మార్చి 31 వరకు ఓటీఎస్‌ స్కీమ్‌ అందుబాటులో ఉందని, ఆ రాయితీ పోగా మొత్తం రూ.82,91,822 మేర బకాయిలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జయలలితకు సంబంధించిన ఈ భవనంలో గతంలో ప్రైవేట్ కార్యాలయాన్ని నిర్వహించారు. అయితే ఈ భవనాన్ని 2017 నుంచి నివాసానికి వాడుకుంటున్నామని.. కాబట్టి రెసిడెన్షియల్‌గా మార్పాలని జీహెచ్‌ఎంసీ అధికారుల్ని జయలలిత మేనల్లుడు, చెన్నైకి చెందిన దీపక్‌ జయకుమార్‌ గతంలో కోరారు.