mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 5:47 am Digital Edition : Namastey Mahaaprabha

హీరో నచ్చితే విజిల్‌ కొట్టొచ్చు.. రాష్ట్రాన్నే అప్పగించగలమా?

‘సినిమాల్లో నటించి హీరోగా రాణించవచ్చు, ఓ సినిమాలో ముఖ్యమంత్రిగాను నటించవచ్చు, అయితే రాజకీయాల్లా అది సులభం కాదు.. అని ప్రముఖ నటుడు ప్రకాష్‏రాజ్‌ టీవీకే నేత విజయ్‌పై పరోక్షంగా విమర్శలతో విరుచుకుపడ్డారు.

  • నటుడు ప్రకాష్‏రాజ్‌

చెన్నై ఏప్రిల్ 18 (మహాప్రభ) : ‘సినిమాల్లో నటించి హీరోగా రాణించవచ్చు, ఓ సినిమాలో ముఖ్యమంత్రిగాను నటించవచ్చు, అయితే రాజకీయాల్లా అది సులభం కాదు. తమిళ భాషకు, జాతికి సమస్య వచ్చినప్పుడు మీరెక్కడున్నారు? ప్రజలు చూపించే ఆదరణను దుర్వినియోగం చేయవద్దు, హీరో నచ్చితే విజిల్‌ కొట్టొచ్చు, అంతమాత్రానికే రాష్ట్రాన్నే అప్పగించగలమా?’ అని ప్రముఖ నటుడు ప్రకాష్‏రాజ్‌ టీవీకే నేత విజయ్‌పై పరోక్షంగా విమర్శలతో విరుచుకుపడ్డారు. దిండుగల్‌ జిల్లా పళని నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి ఎన్‌.పాండికి మద్దతుగా ప్రచార సభలో ఆయన మాట్లాడారు..

తాను నటుడిగా రాలేదని నటన తన వృత్తి అని, తాను నటించిన సినిమాలను టికెట్టు కొనుక్కుని చూస్తున్న ప్రేక్షకుల రుణం ఎలా తీర్చుకోగలనని, దేశానికి, ప్రజలకు సమస్యలు ఎదురైనప్పుడు పరిగెత్తుకుని రావటమే ఓ కళాకారుడి బాధ్యత అని తెలిపారు. అందుకే ఓటరుగా ప్రచారం చేయడానికి వచ్చానని చెప్పారు. ఇవి మూడు మోడళ్లకు చెందిన ఎన్నికలుగా భావించాలని, ఒకటి విద్య, భాషను సంరక్షించే ద్రావిడ మోడల్‌ అని, మరొకటి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టే బానిస మోడల్‌ అని, మూడోది ఒక్కరోజులోనే ముఖ్యమంత్రి కావాలని తపించే సినిమా మోడల్‌ అని చెప్పారు.

రాష్ట్రానికి డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం అవసరమని కేంద్రంలోని బీజేపీ పాలకులు చెబుతున్నారని, అది డబుల్‌ ఇంజన్‌ సర్కారు కాదు డబ్బా ఇంజన్‌ సర్కార్‌ అని యెద్దేవా చేశారు. తమ స్వార్థం కోసం అన్నాడీఎంకే నాయకులు రాష్ట్రంలోకి బీజేపీ అనే సర్పాన్ని లాక్కుని వస్తున్నారని, తమ ఆత్మగౌరవాన్ని ప్రధాని మోదీ పాదాల వద్ద తాకట్టుపెడుతున్న బానిస ప్రభుత్వం మనకు అవసరమా అని ప్రకాష్‏రాజ్‌ ప్రశ్నించారు. డీలిమిటేషన్‌ గురించి ఆయన మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల అధికారాలను లాక్కునేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందని, మెజారిటీ ఉంది కదా అని ఏవైనా చేయవచ్చునని విర్రవీగితే ప్రజాస్వామ్యానికే ముప్పుగా పరిణమిస్తుందని అన్నారు.