mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 11:49 am Digital Edition : Namastey Mahaaprabha

హార్దిక్ పాండ్య కెప్టెన్సీ వల్లే ముంబైకి వరుస ఓటములు.. టీమిండియా మాజీ ప్లేయర్

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యపై విమర్శలు ముదురుతున్నాయి.ఇదే అంశంపై టీమిండియా మాజీ ప్లేయర్ సదాగోపన్ రమేశ్ ఘాటుగా స్పందించాడు. .

ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 14 (మహాప్రభ) : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యపై విమర్శలు ముదురుతున్నాయి. ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు ఓడి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. దీంతో జట్టు వైఫల్యానికి హార్దిక్ పాండ్యనే కారణమంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు విమర్శిస్తున్నారు. ఇదే అంశంపై టీమిండియా మాజీ ప్లేయర్ సదాగోపన్ రమేశ్ కూడా స్పందించాడు. ఇప్పటికైనా హార్దిక్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశాడు.

‘ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ తీసుకున్న నిర్ణయాల వల్లే ఎంఐ ఓడిపోయింది. ముఖ్యంగా తమ అత్యుత్తమ బౌలర్ బుమ్రాను పవర్ ప్లేలో రెండు ఓవర్లు వేయించడం అతిపెద్ద తప్పిదం. ఆ తర్వాత చాలా ఓవర్ల వరకు బుమ్రా బౌలింగ్‌కే రాలేదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రజత్ పాటీదార్ దూకుడుగా ఆడుతున్న సమయంలో స్పిన్నర్ మయాంక్ మార్కండేను బౌలింగ్‌కు పంపారు. రజత్ స్పిన్‌పై బలంగా ఆడతాడని తెలిసినా అలాంటి రిస్క్ తీసుకోవడం నాకే ఆశ్చర్యంగా అనిపించింది’ అని సదాగోపన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

రోహిత్, సూర్య కూడా..

‘నేను, అభిమానులు మాత్రమే కాదు.. మైదానంలో హార్దిక్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై జట్టులోని సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. టిమ్ డేవిడ్‌పై తీసుకున్న రివ్యూ నిర్ణయం చూసి సూర్య షాక్ అయ్యాడు. రోహిత్ శర్మ కూడా పలు సందర్బాల్లో హార్దిక్ నిర్ణయాలతో ఏకీభవించలేదు. హార్దిక్ పాండ్య ఓ ప్లేయర్‌గా అగ్రస్థాయిలో ఉండొచ్చు. కానీ కెప్టెన్సీ పరంగా సాధారణ స్థాయిలోనే ఉన్నాడు. అతడి నిర్ణయాల్లో అయోమయం కనిపిస్తోంది. ఈ తప్పిదాలు సరిదిద్దుకోలేకపోతే ముంబై ఇండియన్స్‌కు మున్ముందు చాలా కఠిన పరిస్థితులు ఎదురవుతాయి’ అని సదాగోపన్ రమేశ్ తెలిపాడు.