mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 07 February 2026, 9:31 am Digital Edition : Namastey Mahaaprabha

హరీశ్‌రావుకు నిరసన సెగ.. డౌన్ డౌన్ అంటూ హోరెత్తిన నినాదాలు : Mahaaprabha

గజ్వేల్ – ప్రజ్ఞాపూర్‌లోని ముంపు గ్రామాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు నిరసన సెగ తగిలింది. హరీశ్‌రావు రాకముందే ముంపు గ్రామాలవారు ఆందోళనకు దిగారు.

సిద్దిపేట, ఫిబ్రవరి 7 మహాప్రభ : గజ్వేల్ – ప్రజ్ఞాపూర్‌లోని ముంపు గ్రామాల్లో శనివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు(HarishRao) నిరసన సెగ తగిలింది. హరీశ్ రావు రాకముందే.. ఆర్ అండ్ ఆర్ కాలనీ ముంపు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా నిరసనకారులు ‘హరీశ్‌రావు డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు బీఆర్‌ఎస్ కార్యకర్తలు కూడా ప్రతి నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.ముంపు గ్రామాల బాధితులు, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య పోటా పోటీ నినాదాలు కొనసాగాయి. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి, ఇరువర్గాలు ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకోవడంతో స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేయడంతో ఉద్రిక్తత కొంతమేర తగ్గింది. ఈ పరిణామాల నేపథ్యంలో హరీశ్‌రావు.. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లోనే నిలిచిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.