టీ20 ప్రపంచ కప్2026లో భాగంగా ఇవాళ్టి నుంచి సూపర్-8 మ్యాచులు ప్రారంభం కానున్నాయి. కొలంబో వేదికగా పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే పాకిస్థాన్ భారీ ఎదురు దెబ్బ తగిలింది.
స్పోర్ట్స్ డెస్క్ ఫిబ్రవరి 21 మహాప్రభ : టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2026) లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి సూపర్–8 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. సెమీస్‌కు చేరాలంటే.. ప్రతి మ్యాచ్ కీలకం కానుంది. ఈ క్రమంలో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..ఇటీవల శ్రీలంక(Srilanka)లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ కప్2026లో గ్రూప్ దశలోని పలు మ్యాచులు వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. సూపర్ 8కి కూడా వరుణ గండం పొంచి ఉంది. న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ జట్టు చేయాల్సిన ప్రాక్టీస్ సెషన్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఆర్. ప్రేమదాస స్టేడియంలో దాదాపు మూడు గంటల పాటు పాక్ ప్లేయర్లు నెట్స్‌లో సాధన చేయాల్సి ఉంది. అయితే భారీ వర్షంతో ఆ అవకాశం దక్కలేదు. మ్యాచ్‌కు ముందు కీలకంగా భావించిన నెట్ ప్రాక్టీస్ లేకపోవడంతో పాక్ జట్టు టెన్షన్‌లో పడింది.ఫిబ్రవరి 21న భారీ వర్షం కురిసే అవకాశాలు(Rain Alert) ఎక్కువగా ఉన్నాయని కొలంబో వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ(శనివారం)మ్యాచ్ ప్రారంభమయ్యే సాయంత్రం 7.00 గంటల సమయంలో 50 శాతంకు పైగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలానే మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య వర్షం కురిసే సూచనలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. దీని ప్రభావం మ్యాచ్‌పై పడే అవకాశం ఉంది.
వర్షం పడితే..
వర్షం కారణంగా ఓవర్లు కుదించే పరిస్థితి ఎదురుకావచ్చు. ఒక జట్టు పూర్తి 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి, రెండో జట్టు బ్యాటింగ్ సమయంలో వర్షం వస్తే డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం కొత్త టార్గెట్‌ను అంపైర్లు నిర్ణయిస్తారు. మ్యాచ్‌కు ఫలితం వచ్చేలా దాదాపు ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే సూపర్–8 దశలో ప్రతి మ్యాచ్ చాలా కీలకం. పూర్తిగా మ్యాచ్ రద్దైతే ఇరు జట్లకు చెరో ఒక్క పాయింట్ లభిస్తుంది. ఇక రేపటి నుంచి టీమిండియా(Team India) సూపర్-8లో తన వేటను ప్రారంభించనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో తలపడనుంది.