mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 11:58 am Digital Edition : Namastey Mahaaprabha

సింగపూర్‌కు ఏపీ ఉపాధ్యాయుల బృందం

ఏపీ ఉపాధ్యాయుల బృందం ఈ నెల 4 నుంచి 9 వరకు సింగపూర్‌లో పర్యటించనుంది. సింగపూర్ పర్యటనకు ఏపీలో 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.

అమరావతి మే 2 ( మహాప్రభ ) : ఏపీలోని ఉత్తమ ఉపాధ్యాయులను అంతర్జాతీయ స్థాయి విద్యా వ్యవస్థలను అధ్యయనం చేయించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఏపీ ఉపాధ్యాయుల బృందం.. సింగపూర్‌కు వెళ్లనుంది. ఈ నెల 4 నుంచి 9 వరకు సింగపూర్‌లో ఈ బృందం పర్యటించనుంది. సింగపూర్ పర్యటనకు ఏపీలో 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులతో బృందాన్ని ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. సింగపూర్‌లో అత్యాధునిక విద్యా విధానాలు, బోధనా పద్ధతులు, పాఠశాలల్లో అమలవుతున్న వినూత్న ప్రయోగాలు, విద్యార్థుల అభివృద్ధి వ్యవస్థలను ఉపాధ్యాయులు సమగ్రంగా అధ్యయనం చేయనున్నారు.

ఇప్పటికే ఈ బృందం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. అక్కడి నుంచి సింగపూర్‌కు విమానం ద్వారా ప్రయాణించనున్నారు. మిగిలిన ఉత్తమ ఉపాధ్యాయులను అధ్యయనం కోసం త్వరలో ఫిన్లాండ్‌కు పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాథమిక విద్యలో ప్రపంచానికే ఫిన్లాండ్ ఆదర్శంగా నిలిచింది. ఈ రెండు దేశాల అనుభవాలను వినియోగించి ఏపీలో విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయాలనేది ప్రభుత్వ ఆలోచన.