ఈత సరదా ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఆనందంగా పెళ్లి వేడుకకు వచ్చిన ఆ కుటుంబం ఆక్రందనల్లో మునిగిపోయిన ఘటన డి. హీరేహాళ్ మండలంలోని బాదనహాళ్ రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం జరిగింది.
- నీటి గుంతలో మునిగి కర్ణాటక వాసి మృతిడి.
హీరేహాళ్(అనంతపురం) ఏప్రిల్ 29 (మహాప్రభ) : ఈత సరదా ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఆనందంగా పెళ్లి వేడుకకు వచ్చిన ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయిన ఘటన డి. హీరేహాళ్ మండలంలోని బాదనహాళ్ రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం జరిగింది. ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపిన మేరకు కర్ణాటక రాష్ట్రం చిత్రుదుర్గ జిల్లా నాగసముద్రం గ్రామానికి చెందిన టైలర్ హంపన్న (38) ఈ నెల 24న మండలంలోని కల్యం గ్రామంలో జరిగే బంధువుల పెళ్లి వేడుకకు భార్య కవిత, పిల్లలతో కలిసి వచ్చాడు. వేడుక ముగిసిన తర్వాత బంధువుల వద్దే కొద్ది రోజులు ఉండాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం హంపన్న తన బంధువులతో కలిసి బాదనహాళ్ రైల్వే స్టేషన్ సమీపంలోనే నీటి గుంత వద్దకు ఈతకు వెళ్లాడు. అక్కడ ఒక వైపు లోతు ఎక్కువగా ఉండటంతో అతడు నియంత్రణ కోల్పోయి నీటిలో మునిగి, బురదలో కూరుకుపోయాడు. అక్కడున్న బంధువులు, స్థానికులు వెంటనే స్పందించి హంపన్నను బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న హంపన్నను ద్విచక్ర వాహనంపై రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.